Friday 16 August 2013


భార్గవి/ తెల్ల కాగితాలైపోయాయి మనసులు!!

ఎక్కడో బూజు పట్టిన
గాజు పెట్టె కింద దొరికిందో పాత పుస్తకం!
తెరచిన పేజీల సందు నుండి
జారిపడ్డ నీ జ్ఞాపకాలు! వాడిపోయిన పూలు...!
జీవంగా లేక, శవం కాలేక
నిరీక్షిస్తున్నట్టు నాకోసం
కాలంలో చెదిరిపోయిన నీ సంతకం కింద నా నవ్వులు
పాత కాగితపు వాసనతో
పరిమళిస్తూనే ఉన్నాయింకా!!

ఎన్నో స్పర్శల్లో పడి నలిగిన చిహ్నమిది!
ఇప్పుడలాగే నా చేతిలో
నన్ను ధాటేల్లిపోయిన
22వ మెయిలు రాయిలా
కళ్ళముందు అంతకంతకూ సాగిపోతోన్న దూరం లో
అస్పష్టమవ్తున్న కాలపు చిత్రంలా
అడ్డుకట్ట వేయలేని
ఆనంద బాష్పాలకు
మనసు నిండి
నిశ్శబ్దపు హద్దులు దాటి
ఆరాధనలీవేళ ఆవేధనలై పొంగి
నిలువెత్తున తడిపేసాయి
నీ జ్ఞాపకాలను!
మౌనంగా నీ మదిని
గిల్లుతోన్న నీ అల్లరిని
పగులగొడుతూ నీ నవ్వు ఇపుడు...
ఖాలీ అయిన చేతుల్లో
ఒంటరితనపు భారం దించుకున్న గురుతులు!
నీవ్రాతల్లో ఒంపుఒంపుకూ
ఎన్ని కొంటె చూపులో!!
కాగితం మలుపుల్లో
ఎన్ని అర్ధంలేని కొట్టివేతలో...
మలుపు మలుపులో మానలేని
గాయం చేసుకున్న మన వాక్యాలు
సావాసం వదులుకుని,
సమాధానం మానుకుని
పదాలైపోయి మిగల్లేని అక్షరాలుగా...
తుది ఆనవాలుగా
తెల్ల కాగితాలైపోయాయి మనసులు!! 
           
                               16/08/13

No comments:

Post a Comment