Friday 30 August 2013

భార్గవి/ అడగాలని ఉందమ్మా ఒక్క మాట-1 / 30/08/13

అమ్మా!
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అమ్మతనంఅంటే ఇదేనా...?
పాపగా ఆనాడు అడగాలనుకున్నా...!
అమ్మని అడుగుతున్నా నేడు!
అమ్మతనమంటే ఇదేనా...?

పల్లెత్తు మాత పలకలేని పసిమనసు
నీకింకా బోదపడలేదా అమ్మా!
చందమామ వద్దు నాకు!
అమ్మ ప్రేమ కావాలని
ఈ చిన్నారి మాటలు
నీ చెవి సోకలేదా అమ్మా!
ఒక్కసారి ఒడి చేర్చుకుని
గోరుముద్దలు పెడతావని
ఎదురు చూసిన కళ్ళలో
సెలయేళ్ళు దాచుకుని 
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అర్ధం చేసుకుంటావుగా!

నువ్వు పంతానికి పోయి
పడకల దాకా లాక్కుని
ముడేసిన బంధం ముచ్చటగా
తెంచుకుంటూనే...
ముడులు ముడులుగా
విలువ తెలుసుకోవడానికేనా
ఈ పెనుగులాట...?
ఎడాపెడా మాటల తూటాలు పేల్చి 
ఎవరి దారి వారు వెతుక్కుంటే
నా గతి ఏవైపో...
చూపించే నాథుడెవరో...
తెలియని సందిగ్ధతలోనే
నేనున్నప్పుడు

ఎన్నో చేతుల ఓదార్పులతో 
చుట్టూ అల్లుకున్న
ముల్లకంచెలను విధిలించుకుంటూ
చీరుకున్న గుండె
రక్తం చిందిస్తూ
కనిపించని నిజాల కోసం
అబద్ధాల ముసుగేసుకుని
ఎదలో నాటుకున్న
కొడవళ్ళు దాటుకుంటూ
నిద్రలేని రాత్రికెన్ని
నిజాలు దారపోసానో తెలుసా...?!
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అమ్మతనంఅంటే ఇదేనా...?

No comments:

Post a Comment