Friday 27 December 2013



గుప్పిట నిండా ఆశలు 
పోగేసుకు వచ్చి 
నీ చేతుల్లో పోసి 
ఖాళీ అయిపోయా...!
కలను, ఇలను చీల్చే 
అడ్డుగోడ మీద భ్రమలా...
మిగిలిపోయా...!
ఎందుకొచ్చావ్ మళ్లీ...?
ఎద గిల్లిపోతావ్!
క్షణం కుదురుగా ఉండనీవు
వెంటాడకలా... నీడలా...
విసిగి వేసారిపోయా...
ఈ చీకటి క్షణాలు వదిలేసి
నల్లటి నీడలు దాటేసి
వెళ్ళిపోదాంరా అలా వెన్నెల్లోకి...!!
27/12/13




ఏకాకి  గుండె లోతులెపుడూ 
తవ్విపోయలేని శూన్యమే...!!
~ భార్గవి
27/12/13
భార్గవి/ నవ్వింది నా మనసు!

నల్లటి రాతిరి పొడిని రాసుకుని
ఎన్నాళ్ళకూ ఎలిసిపోని ఎన్నెల
మనసు నింపి దాచుకుని
వేదనొకటే తెలిసిన గుండె ఇది

నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!
పరదా చాటున
పరిచయం లేని దేహం
పరాయి కాదు నీకే రాత్రీ...!
ఎప్పటికీ ఎవరూ
చెరపలేని తెల్లకాగితానివి
తప్పులన్నీ తుడిచేసే
చీకటి నీడల్లో వెలయాలివి!!
అడుగు దూరంలో ఉంటావు
అందుకోలేను ఏనాడూ
అడగనీవు ఒకమాట!

చీకటి కౌగిట్లో చిక్కుకుని
కనుపాపలన్నీ ఉరిపోసుకుంటూ
ఒక్కొక్కటీ నీ ఊపిరితో
రాలిపోతున్నపుడు
మాటలు పెగలక నే
గొంతు నులుముకుని
శోకాన్ని దిగమింగుతుంటే
విందైన మాటల్లో నువ్
లోకాన్నే ఒంటరిగా విసిరేస్తున్నపుడు
నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!

చిరిగిపోయిన బ్రతుకు
మడతపెట్టి దాచి
సీల ఊడిన బండిని
చీకటితో బిగించి
పరుచుకున్న దారి
పల్లేరులని తెలిసి
భారంగా నిన్ను నువ్వు
ఈడ్చుకుంటున్నపుడు...
నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!

27/12/13

ప్రేమ, పాశాల కోసం పగిలిన గుండె
వేయిసార్లు చేతపుచ్చుకుని
అతికించుకుంటాం!
వేయిన్నొక్కసారి పగలలేని
రాయి అయిపోతుంది!
ఇంక ఏ పెను రక్త ప్రవాహాలూ
పెకల్చలేని పాశానమైపోతుంది!
చిరుగులు పడ్డ గుండె
ఇక స్పందనకు చలించదు
అతుకులు పడ్డ గూడు
భావాలనూ స్పృశించలేదు!
అప్పుడే ఈ శరీరాన్ని
మనిషిగా గుర్తిస్తారు!
కానీ...
నేనెప్పటికీ మనిషిని కాలేను!





Saturday 21 December 2013



పేగు పాశమేనా...? గొంతు నులిమే శాపమైంది!
21/12/13

ఇంకా పసిదాన్నే మరి....!
నీ తోడున్న కాలమేగా నా వయసు కొలత!!
21/12/13