Wednesday 17 August 2016


ఈ తనువుదే ప్రయాణం
పల్లేరులమీద పడకలా
పన్నీటి జలకంలా
పగిలిపోయిన పీడకలలా
గుచ్చుకునే గుర్తులా
కాల్చేసే కన్నీరులా
నవ్వే నువ్వులా
నలిగిన నేనులా
మరపురాని
మళ్ళి రాని
కాలంలా
మానిపోయిన గాయంలా
ఎగిరిపోయిన స్పర్శలా
ఎటూ దారి దొరకని ఎడారిలో
ఎడతెగని ప్రయాణం!!

భార్గవి 18/08/16


Saturday 30 July 2016

భార్గవి/30/07/16

నీ నవ్వుతో తీరిపోయే నొప్పికి
విరహం చేసిన గాయమేమిటో
బదులు రాని ప్రశ్నను మోయడం
ఎంత బరువో నీకేం తెల్సు
అంతరాంతరాల్లో నిర్లిప్తమై
వేల కాంతి యుగాలనుండి నిరీక్షిస్తున్న
కడలి నిద్రలేస్తుంది
నీ కౌగిలికోసం చాచిన చేతులతో
గడ్డకట్టుకుపోతుందలాగే...
ఉదయరవిచంద్రిక మోహనలో
తొంగి చూసినట్టు
కాసేపు ఉరుముతావ్
కాసేపు మెరుస్తావ్
చల్లగా కురుస్తావ్
వేయి వేణువుల స్వరాలు దాచుకుని
నిశ్శబ్ద గీతమొకటే పాడుతుంటావ్
కలవలేవన్న ఆలోచనతోనే
శిలైపోతుందీ  అల
విడిగా లేమంటావ్, విడిపోలేమంటావ్
నీలంగా, నిశ్చలంగా నవ్వుతూ ఉంటావ్
నీకోసం దాచిన ముత్యాలిక బయటికి రావు!
నిన్ను పొందే ఆరాటంలో నేను మాత్రం
కరుగుతూ విరుగుతూ
సుడులు తిరుగుతుంటాను
ఎన్ని తుఫాన్లు, సునామీలు చుసినా
నన్ను చూస్తూ.....
నాకోసం ఉంటావు!
ఆవిరైపోయే క్షణాన గుండెలో దాచుకోవడానికి ఆకాశమై...

Friday 8 July 2016



నిన్ను చూసిన క్షణమేగా తెల్సింది
నా  ఇన్నాళ్ల లోటు తీరిపోయిందని...
ఆ ఒక్క నవ్వు చాలదా...
వేల క్షణాల నిరీక్షణంతా మరచి
నీలోనే మైమరచిపోవడానికి...
నీ  గుండె సవ్వడి వినేంత దూరంలో లేకపోయినా
నా మనసు సందడి నిరాకకోసమే అని
తెలిసినా  తెలియనట్టుంటావు
ముద్దుగా పిలిచినా బెట్టు చేస్తావోయ్
ముద్దపప్పూ.... 
రెండైనా ఒకటే 

ఒకే నీరు
చినుకులా
వరదలా
ఒకే నిజం
జ్ఞాపకం లా
కలలా
ఒకే రోజు
పగలులా రాత్రిలా
ఒకే మౌనం
శబ్దంలా
నిశ్శబ్దంలా
ఒకే మనిషి
నవ్వులా ఏడుపులా
ఒకే రంగు
నలుపులా, తెలుపులా
ఒకే ఆకాశం
విరగబూసిన వెన్నెల్లా
విరిగిపోయిన ఆశల్లా
ఒకేమేఘం
పగలబడినవ్వే మబ్బు చినుకుల్లా
పగిలిపోయిన మబ్బు వర్షంలా
ఒకే అవ్వ
అనుభవ పాఠంలా
అనవసర వస్తువులా

ఒకే జీవితం
నేనులా...
మనంలా...!!

Thursday 7 July 2016


థాంక్స్ నాన్నా!!
ఆరేళ్లప్పుడు అడగ్గానే
పట్టీలు  కొనిపెట్టినందుకు
పుట్టినరోజు నాడు టీవీ కావాలని మారాం చేస్తే
గారాలు చేసి రాత్రికి రాత్రి టీవీ తెచ్చేసినందుకు !

అష్ఠ లక్ష్మినే అష్ఠ దరిద్రం అయినందుకు
ఆడపిల్లనై నీ ఆశల్ని చంపినందుకు,
పదో తరగతిలో పుస్తకాలకోసం అర్థరాత్రిదాకా
నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినందుకు,
నాకో మంచి భవిష్యత్తు ఇవ్వమని
అడగలేని నా నిస్సహాయతకు,
రోజూ సరదాగా తాగేసి, వచ్చిందంతా తగలేసి
ఒళ్ళు తెలియని మత్తులో ఒంటిగంటకు వచ్చినా
శనిలా ఎదురొచ్చి వేడి వేడి అన్నం
తినిపించా చూడు అందుకు,
కారం ఎక్కువైందని తినే కంచాన్ని
తలకేసి కొట్టావు చూడు ఆ నీ మమకారానికి,

మూడేళ్ళుగా బకాయిపడ్డ ఫీజుకోసం
ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా
వెలివేసిన స్కూల్ నుండి ఇంటికీ, నీ ఆఫీసుకి
దూరమెంతో కొలవడం నేర్పినందుకు,
తిండి దండగని ఒళ్ళంతా వాతలు తేలేలా
కొట్టిన బెల్టు చేవలేక తెగిపడితే
కొత్త బెల్టు కొనివ్వలేకపోయానే అందుకు,
అన్నిటికి మించి
ఎగ్జామ్ ఫీజు కోసం ఆకలి చూపులకు
ఎరగా వేసావే ఆ రాత్రి అందుకు,
నరకాసురుని చంపారని అందరూ
దీపాల పండగ చేసుకుంటుంటే
నీ చేతుల్లో పడి నలిగిపోనందుకు
నట్టింట్లో దీపానికి నన్ను ఆహుతి చేద్దామనుకున్నవే
అందుకు,

చిరిగిన బట్టలతో' నలుగురి కళ్ళు  వెంటాడుతుంటే
కంట్లో నీళ్లు కూడా జరానివ్వకుండా
పరిగెత్తిన క్షణాలకు,
ఏ ఒంటరి మేఘమైనా నాతోపాటు ఏడవకపోతుందాని
ఆకాశంలో చూపులు నాటేసి ఎదురుచూసినందుకు,
అంత చూస్తూ కూడా గొంతు పెగలని అమ్మకంటే
ఆ ఇంటి గోడకే తెల్సు నా గోడంతా
గుండె పగిలేలా ఏడ్చిన నిద్రలేని రాత్రులకు
చావుకెదురెళ్ళిన రోజులకు
నన్ను చచ్చేలా బ్రతికించిన
నువ్విచ్చిన క్షణక్షణ మరణాలకు,
అన్నీ నాకే ఇచ్చేసి నువ్ మాత్రం
ఇంకా హ్యాపీగా బ్రతికేస్తున్నావే అందుకే

హ్యాపీ బర్త్ డే టు యూ నాన్నా... 

భార్గవి/ 8/7/16

Saturday 2 July 2016

భార్గవి/ 01/06/16

నిద్రలేవగానే పక్కబట్టల్లో పడిపోయిన
కలలు వెతుక్కోవడానికే అరగంట పడుతుంది. 
ఆలోచనలెంత దులిపినా ఒక్క కలా దొరకదే!?
ఫ్రిజ్ లో  కూరగాయలు తీస్తుంటే
చల్లగా నీ ఊపిరి తగిలింది
నువ్వెప్పుడు దురావబ్బా ఫ్రిజ్ లో...?!
డీప్ ఫ్రిజ్ లో కూడా లేవే?
నీ  బుగ్గలు చూస్తూ టమాటాలు కట్ చేస్తున్నా
నొప్పి పుట్టాక కానీ తెలీలేదు అది వేలని
నువ్ ముద్దాడిన వేలేనని బుజ్జగిస్తున్నా వినదే
నెత్తురెంత కార్చినా ఊరడించడానికిలేవని చెప్పా
అయినా వినదే
కూరలో కరివేపాకులా తీసిపడేస్తానంటావ్
బేసిక్ గా హైట్ కైనా, హెల్త్ కైనా
మంచిదని పెట్టుకుంటే
పెరట్లో కరివేపాకు చెట్టులా నిల్చునే ఉంటావ్ ఎప్పుడూ
చెట్టుగాలి తాకినప్పుడల్లా నువ్వొచ్చావని
పెరటి తలుపు తీసి వెతుకుతున్నా
ఒంట్లో ప్రాణం లేనట్టు ఏంటా ఉతకటం అంటావేగాని
నీ బట్టలక్కూడా గాయం కావద్దని
ఆ సుకుమారం అని తెలీదు నీకు
నీరెండలో మంచమేస్కుని పనసతొనలు
తింటూ కూర్చున్నా నీ పల్లే గుర్తొస్తాయి
అవును మరి అందమైన పలువరసా  అది?
పడుకుంటే పగలంతా నీతో గడిపిన
నిమిషాలే కలలవుతాయ్
చక్కిలిగింతలు పెట్టిలేపుతాయ్
చెప్పులేసుకుంటే నీతో నడుస్తున్నట్టు
స్నానం చేస్తే నీళ్ళై తడుపుతున్నట్టూ
జడవేస్కుంటే నీకోసం ఎదురు చూస్తున్నట్టూ
తింటే నువ్ నాలో బ్రతుకుతున్నట్టూ
ఎవరితో ఏం మాట్లాడినా పక్కనే ఉండి వింటున్నట్టూ
కొంటెపనులు చేస్తే నెత్తిమీద మొట్టుతున్నట్టు
అంతా నువ్వైపోయాక
నాలో నువ్ నిండిపోయాక, నాపేరునే మర్చిపోయాక
నువ్వు నిజమై ఒకరోజు కళ్ళముందు చేరినా
వచ్చానని చెప్పి బుగ్గ గిల్లినా భ్రమే అనుకుంటాను
గిలిగింత పెట్టినట్టు వెర్రినవ్వు నవ్వుతాను!


Thursday 30 June 2016

భార్గవి/30/06/2016


నీ మౌనంలోనే నిద్రిస్తోందా లోకమంతా...
అన్నివైపులా ఒంటరితనమే కురుస్తోందే...
గుండె సడి ఇంత భయంకరమైనదా...
ఓ నిమిషంపాటు నిశ్శబ్దం
నిర్ణయిస్తుందా కాలగతిని?!
రాలిపోయేదంతా రాత్రే కాదు
నా కన్నుల్లో నిను దూరం చేసే
ఈ ప్రయాణం కూడా...
ఈ క్షణాన నేనో మైనపుబొమ్మలా
స్తంభించిన ఆలోచనలతో
లోలోపలే కరిగిపోవడమే తెలుస్తోంది నాకు!
ఛిద్రమౌతున్న ప్రాణాన్ని జారిపోకుండా\
కరిగే కాలాన్ని లెక్కించుకునే
రాకాసి గుండెను మోస్తూ
పెరిగే దూరమంతా కొలుస్తున్న
నీ జ్ఞాపకాలను వదిలేస్తూ
నిన్ను వినలేని నిశ్శబ్దమంత దూరం నాప్రయాణం!!




Thursday 9 June 2016


భార్గవి/ 09/06/16

చీకట్లో ఇంకిపోయిన ఆకాశంలాంటి మనిషి
గుబులు పరుచుకునే వేళ ప్రయాణం కడుతుంది
ఏ ఆడంబరము లేదు
గాజుకళ్ళలో పొంగుకొచ్చే గతం తప్ప!
నవ్వు రేఖ కూడా విస్తుపోయి చూస్తుంది వెక్కిలిగా
అభిమానం పువ్వొకటి సింగారించుకుంటుంది
చిల్లులు పడ్డ చీరలాంటి ప్రాణమొకటే చుట్టుకుంది
చూపు చివర అంచులెనక వదిలేస్తుందది కూడా...

కన్నప్రేమంటే పీఢకలలో
ప్రేతాత్మల ఘోశంటుంది
పాడుబడ్డ గూడులో ఉండలేనని పొగరు దానికి
ఎడతెరిపిలేని వర్షంలోనే గుమ్మందాటి నడిచింది
గొడుగు పట్టిన చేయి విధిలించుకుని వస్తుంది
ఈదురుగాలులతోనే గుండె
అవధులు లేని పరుగుతీస్తుంది
దిగులుపడే మబ్బుకేసి చేయిచాచి చూస్తుంది
కురవని మేఘంకోసం ఎదురుచూస్తానంటుంది
కాలం దాటి వెళ్లిపోయిన గుర్తుకూడా ఎరుగదు

Monday 6 June 2016

అయితే
అంతా కలేనంటావ్...
అవునులే...
కరిగిపోయిందంతా కాలమేగా!
అన్ని లక్షల క్షణాల ఎదురుచూపులన్నీ
ఎదుటపడి పలకరింపులై ముసురుకున్నప్పుడు
మాటలన్నీ పగిలిపోయి
మౌనం మాత్రమే పూసిందే పెదాలపై
ఎదురెదురుగా కూర్చుని
టీతోనో, కాఫీతోనో ముచ్చాట్లాడుతూ
చుట్టూ సొసైటీ, డిగ్నిటీ, ఇగో,
ఇంఫిరియరిటి, ఇన్సెక్యురిటి ఫీలింగ్స్
ఇంతకుమించి భయమో, బిడియమో
బురఖా వేస్కుని
నామమాత్రపు మాటలు
బావున్నావా? టైం ఎంతైంది? ఎప్పుడొచ్చావ్?
ఇంకా ఏమ్ పనిమీద...?
ohh good!, ohh sad!, OMG
ఇంకా...?!
చెప్పాలి...
మళ్ళి  కలుద్దామ్...!!?
okay...
అంతకుమించి గొంతు పెగలదే..?
కళ్ళు వద్దన్నా, కాళ్ళు నడవనన్నా
ఎవరి దారిలో వాళ్ళుగా  మనలోకంలో మనం
పొద్దున్నే యధావిధిగా టెక్నాలజీ కలిపేస్తుంది

గుడ్ మార్నింగ్, తిన్నావా?
ట్రాఫిక్, వర్క్, బాస్, లంచ్ బాక్స్
నిన్న అలా మాట్లాడావ్, అంతలోనే వెళ్పోయావ్!
ఆ డ్రెస్ వేస్కొచ్చావ్, ఇలా మాట్లాడావ్, అలా చేసావ్
పలకరింపులు, పంచుకోవడాలు,
నవ్వులు, ఏడ్పులు, అలకలు
అన్నీ షరా మామూలే!
ఎప్పటికీ విడిపోలేని, కలవలేని
విడి విడిగానే కలిసుండే రైలుపట్టాల్లా, నింగీ నేలలా,

నే పీల్చే గాలి నీ ఊపిరవుతుందనుకుంటూ
నే నడిచే దారే నీ అడుగులు పడతాయనుకుంటూ
ఆకాశంలో చందమామను చెరో వైపూ
కలిసే చూస్తున్నామని భ్రమపడుతూ
బ్రతికేస్తూనే ఉంటాం!
స్నేహం, ప్రేమ, అనురాగం, అభిమానం,
ఏదైనా కావచ్చు, ఏదీ కాకపోనూవచ్చు!
అంతేనంటావా?!
ఆఖరి మజిలీ వరకూ తోడుగానే ఉంటావా?!
ఏదో దారిలో నువ్వూ నడుస్తూనే ఉంటావని
నేనూ సాగిపోతుంటా ఇలాగే...

కానీ మళ్లీ ఎప్పుడు కలుద్దాం అని అడగకే...
అంతేనా...

Wednesday 13 April 2016

భార్గవి/ 13/04/2016

కాలం అడుగేయకముందే కూలిపోయింది వంతెన...
ఏ జ్ఞాపకమో లోయల్లో పడి పగిలిపోయింది
కాలం కూడా అదే మస్తిష్కంలో దూకింది
వెనకడుగేయలేదు!
ముందుకు దారి చేసుకోనూలేదు!

భ్రమలన్నీ లావాలా పొంగుతున్నాయ్
ఉబికివచ్చే సెగ ఉనికిని మింగేస్తుంటే
ఆవిరులన్నీ పేలి ఉషోదయం చేరుతాయ్...
సూర్యుడేమో నక్కి నక్కి నడిరాతిరి చూస్తాడు
నిద్రలేని కన్నుల్లో మంచు ముక్కలౌతాడు!
కాలం నాలో ఆగిపోయాక ఏ ఉదయం రాగలడు సూరీడు?!!
మబ్బు పట్టిన అకాశంలా అలోచన మాత్రం పారుతోంది

తిరుగులేని జీవితంలో...
వెలుగులేని జీవనంలో...
మోగలేని నా మౌనంలో...
ఆలోచనలో వెలిగే రంగులు చూసి
చిందులేసే కనులేవైనా...
మబ్బుకోసి దోసెడు తడి నింపుకోలేవా...?!!

Thursday 28 January 2016

అమావాస్య అర్థరాత్రి
అథ:పాతాళాన్ని తోలిచేందుకు
అంతరాత్మ పొలిమేరల్లోనే తచ్చాడుతుంటాడు
ఆలోచనలకు చీకటి గంతలు కట్టి
ఊహల లాంతరుతో
బయలుదేరాడు...
హృదయ తీరానికి!

ఒకనాటి ప్రేయసి వదిలెల్లిన
అడుగుజాడలను
చూపులతోనే హత్తుకుంటాడు
కంటి చివరే సగం జారిన
మంచు కత్తులతో
కూడదీసుకుంటాడు ఆ మట్టిని
అక్కడే రాలిపోయిన
స్పర్శలకోసం తపన వాడిది!
తడారిన గుండెలోతుల్లో
చెలి వెచ్చని నవ్వుల తేమ
ఇంకా ఉండే ఉంటుందని
తవ్విపోసుకుంటున్నాడు!

ఆ మట్టి మిగుల్చుకుంటావా?! అంటాన్నేను

ప్రతి రాత్రీ వాడి దారంట
పలుకరిస్తూ పోయే దుఃఖాన్ని నేను
వాడి గాయాన్ని వాడై తవ్వుకున్నాడు
వాడిలో వాడే సమాధైపోతూ
చీకటి చినుకులా పలుకరించిన నన్ను
సంద్రంలా నింపుకున్నాడు!
అంతులేని శూన్యాన్నైనా
జాలిగా వెతుక్కుంటే ఒడి చేర్చుకుని
జోలపాడటమే తెలుసు నాకు!
వెంట తెచ్చుకున్న
లాంతరు కూడా ఆర్పేసి
ఫక్కుమని ఓనవ్వు విసిరి
మట్టి కప్పుకు నిదరోతానంటాడు!
ఆణువణువూ చీకటి నింపుకుంటూ కలలై
మృత్యు కౌగిలిలో తలవాల్చుకుంటున్నాడు