Saturday 24 August 2013


భార్గవి/ బాల్యమా ఒక్కసారి తిరిగిరావూ..

అమ్మో...!

గాయాలేం తొలచటంలేదేంటో... 
ఎపుడు గడచిపోయిందో కాలం 
కళ్ళముందు కాంట్రాస్ట్ కలలా కదలాడుతోంది!
చిన్నప్పుడు ఇంటిముందు సందులో 
గాలీ దుమారంలో ఆడుతుంటే 
పీల్చిన మట్టివాసనింకా వస్తూనే ఉంది
సన సన్నటి వాన చినుకులు 
ఎడతెరిపి లేకుండా కురుస్తుంటే 
ఎవరేడుస్తున్నారా ...?! ఇంతసేపు 

అనుకుని చిరాకేసేది!
అప్పటి నా కన్నీళ్ళను ఆ చినుకులు 
కప్పేసినపుడు ఆనందమేసేది!
చల్లని చినుకులను నిండుగా 
గుండెకు హత్తుకునేదాన్ని!
వాటికి తోడు 
ఆకాశంలో ఉరుములు, మెరుపులూ... 
ఇత్తడి లంకె బిందెలను ఎత్తుకుని 
మువ్వలు కట్టుకున్న ఎడ్లబండి 
సాగిపోతున్నట్లు వినిపించేవి
వీధి వీధంతా కలయచూసి 
వానల్లో స్నానం చేస్తున్న కప్పలమీద
విసుగ్గా రాయి విసిరేదాన్ని!

వర్షం వచ్చిన రాత్రి(చందమామ)బూచిమామ 
ఆకాశంలో మబ్బుల చాటున దాక్కుని 
 అప్పుడప్పుడు నవ్వుతూ 
మెరుపులతో ఫోటోలు తీస్తుంటే 
నేను తప్పించుకు తిరిగే దాన్ని!!

ఎప్పుడు గడచిపోయిందో కాలం!
గిర్రున తిరిగి తిరిగి వచ్చి 
కంటిపాప చాటునుండిపుడు
నక్కి నక్కి చూస్తోంది!
చుట్టూ చీకటి చూడగానే 
బాల్యం బిక్కు బిక్కుమంటూ 
కాలాన్ని కప్పుకుని నిధ్రపోయిందట!
బాల్యమా ఒక్కసారి లేచి తిరిగిరావూ...!
అదే మట్టితో మళ్ళీ ముచ్చట్లాడుదాం
జారిపోయిన ఊసులన్నీ గాలం వేసి పట్టి 
గుండెలకు అతికించుకుందాం!!

.   24/08/13




No comments:

Post a Comment