Tuesday 28 January 2014

మరకలు వదలట్లేవు...!
మతిమరపుతో కడగాలనుకుంటా...!!
~ భార్గవి
28/01/14

నీతో ఓ సాయంత్రం...!
కప్పు మౌనం..., గుప్పెడు ఏకాంతం... చాలులే! 

Saturday 18 January 2014

పాదం పయనిస్తుంది
ప్రాణం నడిపిస్తుంది
కానీ గమ్యం తెలియదు
తీరం కదలదు!!

మేఘం చెదిరిపోతుంది
జాబిలి కరిగిపోతుంది
కానీ ఆకాశం మారదు
జాబిలిని వీడదు!!

కాలాలు మారుతాయి
నేస్తాలూ మారుతారు
కానీ స్నేహం మారదు
నేస్తాన్ని మరువదు!!

-భార్గవి
15/06/12

Friday 17 January 2014

ఆకాశం ఏంటో...
వింతగా ఉంది ఈ పూట!
నాకోసమే వెతికి
నవ్వుతున్నట్టుగా ఉంది
ఈ చుక్కల తోట!
దారి తప్పావోయి బాటసారీ... అంటే
వేలు పట్టుకుని నడిపింది నువ్వే కదా!

ఈ బాటెంట వొస్తే నీ దాహం తీరేదెలా?!
ఎదురేగే అనంతానంత
ప్రహేళికా మేఘాలు నన్ను ముంచెత్తినా
వసంతాలు, గ్రీష్మాలూ
నన్ను దాటెళ్లి పోయినా...
ముళ్ళ దారి వెంట చీకటి ప్రయాణం
ఎన్నాళ్లని సాగించను చెప్పు...
ఎడారైన ఎదలో
నవ్వుల వర్షం కురిసి
ప్రేమ సంద్రంలా మార్చేస్తావు మది
మరు క్షణంలో మర్చిపోవటం నేర్పించి
ఆవిరి చేస్తావు ఆశల్ని...
నీ పిలుపుకోసం ఇంకా ఈ బురదగుంటలోనే
చితికిపోయిన మనసు మజిలీ
చితి కి పోయే వరకూ ముందుకో, వెనక్కో
సాగుతూనే ఉంటుంది పాదం!
నాకు తెలుసు!
నా దారినే ఎదురొస్తావని
దరి చేరడానికో, కడతేర్చడానికో...
ఈ దిక్కు తోచని స్థితిలో
నీకోసమే కాదా అన్వేషణ...

~ భార్గవి
17/01/14
కళ్ళలో నీళ్లు ఇంకిపోలేదు కానీ
బాధే బతుక్కి వెగటైపోయింది!
నవ్వాలనుంది కొన్నాళ్ళు...
నవ్వు కూడా నన్ను చూసి విస్తుపోయేలా...
గుండె రాటుదేలిపోయిందనుకుని
నవ్వుకుంటున్నానిప్పుడు...
అయినా...
ఓటమి ఓదార్చినంతగా
గెలుపు వెన్నుతట్టలేదు నన్ను!
ఇప్పటికైనా తెలిసింది ఒకటే నిజం!
నాకోసం నేను ఆనందించడం కంటే
ఒకరి సంతోషం కోసం పడే
బాధే తృప్తినిస్తుంది నాకు...!!

~భార్గవి
17/01/14