Thursday 7 November 2013

భార్గవి/ నేడిక శెలవు చెప్పుకుందాం నేస్తం!

నేడిక శెలవు చెప్పుకుందాం నేస్తం!
తోడు నడవలేక
నీడలు తూలిపోతున్నాయి...
నీరసంగా వ్యథలు
నిదురపోతున్నాయిక...

కాలమ్ చాలక
గడియారం ఒక్క సెకనులోనే
11 అంకెలు మింగేసి
ఈ రేయి  ఒంటిగంట
దగ్గరే ఉరేసుకుంది!!

కొన్ని రెక్కలు ఇంకా
దిక్కులు వెతుక్కుంటూ
గూడు కోసం
తిప్పలు పడుతున్నాయ్!
గింజపడక పొట్టలో ఆకలి
పేగుల్ని నములుతుందిపుడు!!
నువ్వు వెళ్ళిపో నేస్తం!
నేడిక శెలవు చెప్పుకుందాం!!

రాతిరి కత్తులకు తెగిన
చుక్కలేమ్ చెప్తాయో !?
సముద్రాలన్నీ మింగిన
మబ్బులెక్కడ దాక్కున్నాయో!?
లోకం సమాధిలో
నిద్రిస్తున్న జీవశ్చవాల
కలలో కలుసుకుని
చర్చించాలిప్పుడు!
నేడిక శెలవు చెప్పుకుందాం!!

Wednesday 6 November 2013




నా పెదాల్తో నవ్వే హక్కెవరిచ్చారు నీకు...?!

నీ మనసు మసిబారింది!
ఆలోచనల్లో నన్ను కాల్చేసావుగా!!
06/11/2013


నిజం నిక్కచ్చిగా చెప్తే మింగుడు పడదు
మరి కఠిక విషం లాగానే తోస్తుంది.
"తినగ తినగ వేము తియ్యనుండు" అన్నట్లు
నిజం చెబుతున్న కొద్దీ...
విషానికి భానిసలైపోక మానరు!
ఇకనైనా ముసుగులు తీయండి!
అందమైన అబద్ధాలు గిలిగింతలు పెడుతుంటే
కలుగులో ఎలకల్లా లోపల్లోపలే గంతులేయకండి.
మనుషుల్నెరుగని మనుషులెవరూ లేరిక్కడ!
పుర్రకో బుద్ది!
జిహ్వకో రుచి!
అంతేనా... లోకం పోకడ?!
చిత్త చాపల్యం లేనిదే బుద్ది వికసించదట!
మీకేమైనా తెలుసా??

Tuesday 5 November 2013

భార్గవి/ ఆకాశం మాట్లాడింది!!

సగం మూసిన కన్నుల్లో నిద్ర
మత్తుగా అంతర్ధ్వారాలు  తెరచుకొని
నట్ట నడిరాతిరి ఉదయాలను
చిత్రించాలని బయలుదేరాను!
ఆకాశం వైపు...!

ఎన్నో నిద్రలేని రాత్రులు
కుమిలిపోయిన కన్యల
అర్ధాంతర జీవితాల ఆక్రందనల మధ్య
చీకటి నింపుకున్న గుండెలు
తొలుస్తూ అడుగులేసాను!
ఆనాడు ఆకాశం మాట్లాడింది!!

నిస్సత్తువ సైన్యంలా లోకమంతా
నిధ్ర ముసుగులేసుకున్న వేళ...
పగలంతా యాంత్రికత పులుముకున్న
మనసును పొరలు పొరలుగా విప్పుకుని
భగ్నమైన ఆలోచనల
అంచుల్లో తచ్చాడుతున్న వేళ...
అడుగు కింద
ఆత్మ వంచన చేసుకున్న పసిమొగ్గల
ఆవేదనలు కదిలిస్తుండగా...

అరాచకానికి బలైన నిండు ప్రాణాలు
శుష్కించిపోతున్న నా అంతరాత్మను
అథ: పాతాల లోతులు చీల్చుకుని
చట్టాల ఉరితాళ్ళు కత్తిరించి
న్యాయ హస్తమందించమని
తమ గోడు వినిపిస్తుండగా
ఆకాశం నాతో మాట్లాడింది!!

ఎన్నో నలిగిపోయిన పువ్వుల్ని తనలో
చుక్కలుగా నింపుకుంటుందో చెబుతుంది!
చరిత్రంతా తనముందు ఘనీభవించి
రంగురంగుల మేఘాలైన బ్రతుకులు
తనలోనే, తనతోనే కూడగట్టుకున్న
శోకమంతా ఈ విధి వంచితుల సమాధులకే
తలబాదుకుంటుంటే... నిప్పుల వర్షమై
ఎన్ని బ్రతుకులు పగిలిపోయాయో చెబుతుంది!

పడతులు జ్యోతులై ప్రజ్వలిస్తుంటే
చుట్టూ మూగుతున్న పురుగులు వీళ్ళు!
ఆకర్షణలో పడి రెక్కలు కాల్చుకుంటున్న పురుగులు!
మలినపర్చలేక ధహించుకుపోతున్నది
పురుషాహంకార దేహాలే...!
జ్వలనమెపుడూ మలినపడదే మానినీ అంటూ
ఆనాడు ఆకాశం నాతో మాట్లాడింది!!

23/10/13