Saturday 17 August 2013


భార్గవి/ 17/08/13

నీకై వెతికే నిరీక్షనలో...
ఎద గుమ్మం దాటలేని ఆశలు!
చుక్కల్లో చిక్కుకున్న చూపుల్లో 
అవి రెక్కలున్న సీతాకోక చిలుకలు!!

వాన చినుకుల దారాలల్లి
చూపులతో చిలుకుతున్నా!
అకుంఠితమైన ఆనందపు
వెన్నెల వెల్లువ పొంగి
దట్టమైన మేఘాలు కమ్మి
పగిలిన హృదయంలా
హోరు గాలి వీస్తుంది!
పరుచుకున్న దు:ఖంలా
జోరుగా జడివాన కురుస్తుంది!!

తనకు తాను పాదు చేసుకుని
నీరు తోడుకున్న మొక్క
నన్ను చూసి ఫక్కుమంది!

అడగమన్న అడుగు
ఆగమన్న పరుగు
వీడని వీసమంత వింత
ఎందుకు ఎందాకని
నీ ఎడారి ఏకాంతపు పంతం
ఎందాకో ఎగరలేదు
తడిసిన నీ తలపు

సందేహపు సందేశం
సాగలేదిక సాంతం!!
ఆపలేని ఓపలేని
ఆవిరైన ఉచ్చ్వాసలను
వేగంగా వెళ్ళనీ...
గొంతు నులిమి పట్టకు 
అవే నాకు ఊపిరులు...

ఎద గుమ్మం దాటలేని ఆశలు!
అవి రెక్కలున్న సీతాకోక చిలుకలు!!
రంగుల వసంతం
పూసుకున్న తలపులు
అవి తెరవమన్నాయి
ఆలోచన తలుపులు...

రేపటి కలల రెక్కలిచ్చి
ఇవాళ్టిలోనే బంధించావేం...??


No comments:

Post a Comment