Tuesday 23 September 2014

అడగాలని ఉంది ఒక్కమాట!

అమ్మా...!
అడగాలనుంది ఒక్క మాట!
అమ్మతనమంటే ఇదేనా...?!
అమ్మంటే అనురాగ దేవత
ఆప్యాయత ప్రతిరూపం అని
బల్లో, గుళ్ళో చెప్థారట
మరి ఏఒడి పంచుకుంటుందో
హామీ ఎవరూ ఇవ్వటంలేదేంటమ్మా?
ఎందుకంత ప్రేమమ్మా నామీద
ఒల్లో చేరకముందే
గర్భ గుల్లోంచి వెలివేస్తున్నావు నన్ను
దేహపు దాహం తీర్చుకోవడానికి
పసిమొగ్గల్లో కూడా
మకరందం వెతికే
మదమెక్కిన జోరు తుమ్మెదలున్న ఈ తోటలో
పూవునై నేను పరిమళించలేనని
మొగ్గగానే తుంచేస్తున్నావా అమ్మా?

నా గుండె చప్పుడు వినమనే మాట
ఏ ఒక్కనాడైనా
నీ చెవినేయగలిగానా?!
నా భావాలు నాలోనే
నిక్షిప్తం చేసుకుని నిర్లిప్తంగా
చూస్తుండిపోయాను కానీ...
నీ కడుపులోనే
కరిగి కరిగి చిద్రమవుతున్న
నా రక్తపు ధారల వాసన
శ్వాస తీసుకుంటూ
నాన్నకెందుకో అంత
స్వాంతన చేకూరుతుంది
అడగాలని ఉంది ఒక్కమాట
అమ్మతనం అంటే ఇదేనా?!

పగిలిన నా గుండె నెత్తురు
నీకంటనే జరుతోందమ్మా...!

నే దాటలేని చూపొకటి విసురుతూ
వేసుకుంటావు రెప్పల తలుపులు
అనురాగానికై పరితపించే నేను
గుమ్మం బయటే చూపుల
నెగళ్ళు పాతుకుని వేచి చూస్తాను!

దేహమడిగిన ప్రశ్నకు
సందేహం లేకుండానే
సమాధానం చెప్పావేమో!
మరి నా చూపుల్లోని
ప్రశ్న కూడా తెలుసుకుని
నువ్వే అడుగుతావా అమ్మా!

ఆడపిల్లనైన పాపానికి
పుట్టకముందే
పుట్టెడు మట్టితో
కప్పెట్టాలనుకుంటున్నారు
అమ్మతనం అంటే ఇదేనా అమ్మా?!
అడగాలని ఉంది ఒక్కమాట!
సమాధానం చెప్పమ్మా...!!
............................................................................................................................................................

అమావాస్య అర్థరాత్రి
అథ:పాతాళాన్ని తోలిచేందుకు
అంతరాత్మ పొలిమేరల్లోనే తచ్చాడుతుంటాడు
ఆలోచనలకు చీకటి గంతలు కట్టి
ఊహల లాంతరుతో
బయలుదేరాడు...
హృదయ తీరానికి!

ఒకనాటి ప్రేయసి వదిలెల్లిన
అడుగుజాడలను
చూపులతోనే హత్తుకుంటాడు
కంటి చివరే సగం జారిన
మంచు కత్తులతో
కూడదీసుకుంటాడు ఆ మట్టిని
అక్కడే రాలిపోయిన
స్పర్శలకోసం తపన వాడిది!
తడారిన గుండెలోతుల్లో
చెలి వెచ్చని నవ్వుల తేమ
ఇంకా ఉండే ఉంటుందని
తవ్విపోసుకుంటున్నాడు!

ఆ మట్టి మిగుల్చుకుంటావా?! అంటాన్నేను

ప్రతి రాత్రీ వాడి దారంట
పలుకరిస్తూ పోయే దుఃఖాన్ని నేను
వాడి గాయాన్ని వాడై తవ్వుకున్నాడు
వాడిలో వాడే సమాధైపోతూ
చీకటి చినుకులా పలుకరించిన నన్ను
సంద్రంలా నింపుకున్నాడు!
అంతులేని శూన్యాన్నైనా
జాలిగా వెతుక్కుంటే ఒడి చేర్చుకుని
జోలపాడటమే తెలుసు నాకు!
వెంట తెచ్చుకున్న
లాంతరు కూడా ఆర్పేసి
ఫక్కుమని ఓనవ్వు విసిరి
మట్టి కప్పుకు నిదరోతానంటాడు!
ఆణువణువూ చీకటి నింపుకుంటూ కలలై
మృత్యు కౌగిలిలో తలవాల్చుకుంటున్నాడు


నేనొకన్నే నిల్చిపోతే
నింగినుండీ తొంగి చూసే
రంగురంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ ,
నిశీర్థాలూ విశీర్లిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నేనొకన్నీ ధాత్రి నిండా నిండిపోయి
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తాలాగమిస్తాయి

 ~శ్రీశ్రీ
మహా ప్రస్థానం 

Monday 22 September 2014

"నీకే నువ్వు అర్థం కాకపోవటమేంటో...!?!"
ఆలోచనలు చినుకులై కురుస్తూనే 
లోపలే ఆవిరులై నల్లగా ఘనీబవిస్థున్నయ్!
నవ్వులు ఏమాత్రం అతికించుకోలేని
దు:ఖపు మేఘంలా...
కురవడానికి సిద్దంగా...
యుగాలపాటు పొగిలినా, కురిసినా
కరగని మంచు శిలైపోయింది మనసు!
ఇప్పటికైనా నువ్వు ఊపిరులూదగానే
కరుగుతూనే ఉంటుంది... 
వెచ్చని చేయి తగలగానే
పగులుతూనే ఉంటుంది...

మౌనం వేయి ప్రశ్నలకు సమాధానంగా మిగిలిపోతుంది!!
మౌనంగా మిగలటం వేయి ప్రశ్నల్ని వెలికి తీస్తుంది
22/09/14