Saturday 11 August 2018

చందమామ ముక్కను వెన్నెల్లో నంజుకు తిన్న
ఆకాశంలా సుషుప్తావస్థ లో ఉన్న నాకు
మునువు జన్మలో తప్పిపోయిన నీ కల...
హఠాత్తుగా నిద్రలేచి ఎప్పుడో ఎగిరిపోయిన మనసుకోసం
అద్దంలో వెతుకుతాను
మోడువారిన అడవిలో ఎండుటాకుల్లో
పూలకోసం వెతుకుతాను...
ఇన్నాళ్లు మౌనం మింగి కోమాలో ఉన్న మాటలన్నీ
పెదాలు విరుచుకుని దూకేస్తాయ్.
ఒక్కోమాట నాదికాక ఏ గుండె తీరానికో చెందినవని
తెలుసుకుని వేషం మార్చి
జ్ఞాపకాల ముసుగేస్తాయ్!
పూర్తిగా జ్ఞాపకాల రెక్కలు తెగిపోయాక
చివరి ప్రేమ చుక్క రక్తంలా ఇగిరిపోయాక
కాలానికి వంతెన కట్టి కొత్త రంగుల వసంతమై కురుస్తావ్
పరిచయాల మత్తు జల్లుతావ్
చెదిరిన స్వప్నానివో.. చేరిన గమ్యానివో...
ఎవరిచ్చారని హక్కు?
ఎదలో నూరేళ్లవరకు...!
-భార్గవి
11/08/18