Sunday 30 June 2013

కవితా వనం

భార్గవి// కవితా వనం

నేనెక్కడో ఎడారిలో పూచిన
నాగజెముడు మొక్కను!
ఒళ్ళంతా కళ్ళై ఎదురు చూస్థాను
ఏ తడీ నేకోరుకోను!
ఏ నీడా చేరలేను!
నాలోనూ తడి ఉంది
ఆ తడిని కూడా పీల్చుకుని
సంద్రం చీలుకుని ఏరులై
పొంగి పొరలుతుంది
కొండ వాగుల గుండె లోతుల నుండి...
మదుల నదుల చేరి
చేలగత్ల పారి చిగురిస్తుంది
చెంగల్వలై కొలనులో, కోనలో
వేచి పూచి గడ్డి పువ్వుగా
నాలో భావం ఒకపరి వికసిస్తుంది

నా భావాన్ని చేరుకోలేని నేను!
ఎండమావుల లోనే నిదరోతాను!
కావ్యాల సీమ(కవి సంగమం )ల్లో... ఎన్నో
కవితా కవితావనాలు చిగురిస్తాయి!
వేన వేల కవిత కుసుమాలు విరబూస్తాయి

తెలుగు మట్టిలో అక్షరాల వేర్లు పాతుకుపోయిన
ఎన్నో మహాకవి వృక్షాలు
నిండుగా, పచ్చగా
చిరు మొక్కలకు సారాన్నిస్తూ కాపాడుతాయి
ఆ దారిన వెళ్ళే బాటసారులకు
పదాల ఫలాలిచ్చి మనసు నింపుతాయి
చల్లని, తెల్లని కాగితాల ఆకులు పరచి నిద్రపుచ్చుతాయి

పచ్చని వనమై...
ప్రతీ ఉదయం
కవితా హృదయం
పల్లవిస్తూనే ఉంటుంది!
                                     01-07-13



Thursday 27 June 2013

భార్గవి/ 28-06-13/వెళ్ళు హరా!

ఎవరన్నారక్కడ శివుడున్నాడని??
ఎంత వాడు శ్మశానంలో ఉండేవాడైతే మాత్రం...
భక్తులకోసం దిగివచ్చాడా...?!
కొలువై ఉండాలనుకున్న నెలవు
తనకు అనువుగా మార్చుకున్నాడు
ఆ ముడుకన్నుల ముక్కోపి!
వెళ్ళు హరా!
ఇకనైనా వెళ్ళిపో!!
కానరాని కాలంలోనే కైలాసంలోనే నీ కొలువు
మమ్ము మాత్రం మూడోకంట చూడకు!
ముచ్చటపడి నీ భక్తులకోసం దిగిరాకు!!




వర్ణం లేని పువ్వుకు వన్నెలధ్ధావు!


Wednesday 26 June 2013

తెలియదు నాకు

భార్గవి/ 25-6-13/ తెలియదు నాకు

తెలియదు నాకు!
నల్లని రాతిరిలో
వెలిగే పాపపు దీపపు
నీడలు పట్టుకు వేలాడే
మిణుగురు పురుగును నేను!!

రాకాసి రంకె వేస్తుందని...
బీటలువారిన నా ఊహల
తోటల్లో నెగళ్ళు పుట్టుకొచ్చాయని...
జ్వాలల్లో మిగిలిన గాలితోనే
బ్రతుకు పునాది వేసుందని...!
తెలియదు నాకు!!

గతం లేదని...
మరచిపోయాననుకుని...
చిరునవ్వుల గూడు కట్టాను!
గుండె దిగజారే భారం మోస్తున్నానని
తెలియదు నాకు!!

సులువు కాని బంధాన్ని
సున్నితపు నమ్మకాల దారంతో
అల్లుకున్నాను నేను!
సమ్మెట పోటుకు కూడా
అంతం సాంతం చవిచూస్తుందని
తెలియదు నాకు!!
          

Sunday 23 June 2013

నీ కనులు చూడలేని లోతు
నా హృదయ సముద్రం!!
                          23/6/13
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
ఏదో గుబులు రేపుతావు
గుండెలోతుల్లోన!
పరుచుకుంటావు సంధ్యవై నాలో!
విరుచుకుంటావు విలయమై లోలో!!
ఏ క్షణంలో తొలకరివౌతావో ?!
ఏ మౌనంలో జడి వానౌతావో?!
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
కరిగిపోనీవు!
నీలో
కలిసిపోనీవు!
అలసిపోయాను
కానీ... 
అడగనివ్వవు ఒక మాట!
 తెలుసుకుంటావు
ఏదో...!
ఎంచలేనేనాడు
ఎవరు నువ్వంటే...
చెప్పగలవా చెప్పు
ప్రశ్న నేనడిగితే...!?
అర్ధరాథిరి వేళ
ఆవరిస్తావు నన్ను!
గుండె లోతులు తోడి
గుట్టు కాజేస్తావు!
నవ్వుతుంటావు!
ఏదో మూల
నక్కి ఉంటావు!
ముల్లులా...
గుచ్చుతుంటావు!
పూర్తికాని స్వప్నంలా...!
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
భార్గవి/ 19-06-13

హవ్వా...!
నవ్విపోతారు!
చెప్పకు! నువ్వు నోరు విప్పకు!!
ఏమిటోయ్...! నీ మాటా... నువ్వూ...??

చీకటంటని చంద్రుడు
వెన్నెల పంచుతాడా?

పూల వాసనెరుగక
తుమ్మెద మజిలీ తీరుతుందా?

నింగినంటక కారు మేఘం
వర్షం కురిపిస్తుందా?

మట్టి తాకని చినుకు
మొగ్గ తొడుగుతుందా?

ఏం చెప్తున్నావ్ మరి?
అర్ధరాతిరి వేళ నాకు ఆశలఉరి బిగించి

బ్రతుకు నాదే కానీ
శ్వాస నీది ఇచ్చేయమంటావా?

తాపంతో ఉవ్వెత్తునెగసి
అలవై ఆవిరై నాలో చేరిపోతావు!

కారుమబ్బునై నాలో కలుపుకుని
చినుకునై నిన్ను చేరుతానంటే
పవనమై నన్ను సాగనంపుతావా?!

నేను లేని నిండుతనం నీకెలా సాధ్యం?

Thursday 20 June 2013

స్వేచ్చాలోకం మనది

అవును మరి!
స్వేచ్చాలోకం మనది
నా కల కల్ల కాదని నేననుకోవచ్చు!
నీ మాట నెగ్గిందని నువ్వూ అనుకోవచ్చు.
ప్రేమ రాజ్యమేలుతుందని
పిచ్చోళ్ళనుకోవచ్చు!!

అవును మరి!
స్వేచ్చాలోకం మనది!
రాజ్యానికి రాజు, ప్రేమకు పిచ్చోళ్ళు
ఉంటె చాలుగా....!
మనిషీ, మనసూ
మాట, ముచ్చట
చాలుగా ప్రేమకు?!

నమ్మకాల సైనికులు
సహనాయుధాలు
ప్రేమ రాజ్యానికి రక్షణా మరి?
అంతే మరి!
స్వప్నావేశమ్ ఉంది రాజుకు!
మొహం దాహం వేస్తుంటుంది!!
ఎప్పుడూ గొంతు తడుపుతునే ఉండాలి
తపనల మత్తులో తూగుతూనే
ఉంటాడు రాజు!

అవును కధా మరి!
స్వేచ్చాలోకం మనది!
రాజే రాజ్యమేలుతాడని
ప్రేమే జీవితాన్ని నడుపుతుందని
చూసే కళ్ళు అనుకోవచ్చు!
మరి చెవులు వినేయొచ్చు!!

మంత్రి సలహాలతోనే తీర్పులుంటాయని...
అనురాగపు మంత్రి చేతిలో
రాజు కీలుబొమ్మనీ... అనుకోవచ్చు!
సగం కాకపోయినా సర్వస్వంలో
స్వార్ధంలో ఇమిడిపోయి
వద్దనుకున్నా, వారిస్తున్నా
నేనున్నానని సవరించే మంత్రి అనురాగం!
ప్రేమకు అహం దాహం పెరిగినపుడు
అనురాగం, అభిమానాన్ని నింపి
గొంతు తడుపుతుంది.

అవును మరి!
అనుకోవచ్చు...
ప్రేమ రాజ్యమేలే చోట
అనురాగపు మంత్రి ఉన్నా...
నమ్మకాల సైనికులున్నా...
సహనాయుధాలు ఎన్ని ఉన్నా...
నవ్వు, కోపం, బాధ, చిరాకు,
సుఖం, దు:ఖం, అవగాహన, ఆనందం,
అపనమ్మకం, అనారోగ్యం, ఆశ, నిరాశ
అన్ని రకాల ప్రజలుండాలి!
ప్రేమను సింహాసనంపై కూర్చోబెట్టి
ప్రేమించే, పూజించే, పట్టం కట్టే భావాలుoడాలి

అవును మరి!
అనుకోవచ్చు...
స్వేచ్చాలోకం మనది!
రాజభోగం చూసి రాజు కావాలని...
రంగుల లోకం చూసి ప్రేమ కావాలని...
సింహాసనం కోసం రాజ్యం కావాలనీ...
ఆకర్షణ నీడల్లో ప్రేమ వెతకాలని...
 అనుకోవచ్చు...

స్వేచ్చాలోకం మనది!
స్వప్నావేశమ్ ప్రేమది!!
అవును మరి!
నా కల కల్ల కాదని నేననుకోవచ్చు!
నీ మాట నెగ్గిందని నువ్వూ అనుకోవచ్చు.
ప్రేమ రాజ్యమేలుతుందని
పిచ్చోళ్ళనుకోవచ్చు!!


Wednesday 19 June 2013

శూన్యంలో...

భార్గవి/ 08-06-13/ శూన్యంలో...

నేనునేనుగా నా శూన్యంలోకి అడుగిడతాను!
మరణ రాగం మెల్లగా సోకినపుడు...
మృత్యు గీతం నను లాగినపుడు...
నేను నేనుగా నా శూన్యంలోకి అడుగిడతాను!!

నిండైన నిశిలో నా నీడ అక్కడ...!
నుసియైపోయిన నా జీవన ప్రయాస అక్కడ!
నా కన్నుల్లో దాగి ఉన్న నిరాశలు అక్కడ!
కను కొలికి దాటి రాలేని నిజాలు అక్కడ!

అదే చీకటిని కాపలా చేసి
కనురెప్పల మాటున దాగిన జ్ఞాపకాలు అక్కడ!
మౌనంలో చిక్కుకున్న ప్రశ్నలు అక్కడ!

అన్నీ దాచుకున్నాను, భద్రపర్చుకుంటున్నాను.
ఏవీ...?! ఎక్కడ?!!
శూన్యానికి చేరుకున్నా...
ఇంకా వెతుకుతూనే ఉన్నా!
మరచిపోయానేమో!
వదులుకున్నానో మరి!?
చేజారిపోయుంటాయా?!!
ఎంత వరకు చేరినా 'నేను'
'అంత'o వరకూ 'నేనే'నా...?

నాపూర్వ జన్మ పరిమళాలు,
కోకొల్లలుగా జ్ఞాపకాలు, నిట్టూర్పులు
నిజాలు, నిరాశలు...
వేనవేల చూపులతో శూన్యంలో ఇమిడిపోయి అక్కడ!!
నాకోసం వేచి ఉన్న నా గతానుభవాలు అక్కడ!

నన్ను కూదా ఒధిగిపొమ్మని హాయిగా...
పిలుస్తున్న పిలుపులు...
అప్పుడు కానీ...
అక్కడ కానీ...
తెలుసుకున్నాను!
కలిసిపోయాను శూన్యంలో...
'నేను' అనే శూన్యంలో... !!




Sunday 16 June 2013

నకిలీ నవ్వులు

నకిలీ నవ్వులు 

నకిలీ నవ్వులు!
నాలుగు...!
నాపరాళ్ళు పోగేసుకుని 
అందమైన అబద్ధం
కట్టుకుంటాడొకడు!!
తెల్ల కాగితాలు!
నాలుగు...!
తోచిన గీతలు గీసుకుని
పనికిరాని క(ళ) లను
కూడబెట్టుకుంటాడొకడు!!

మాటల మూటలు!
నాలుగు...!
నింగిని చుక్కలు చూపి
అవసరాలు
తీర్చుకుంటాడొకడు!!

నమ్మిన చేతులు!
నాలుగు...!
నీడనిచ్చే గుండెలను
ఏమార్చి, నిండుగా
నవ్వుకుంటాడొకడు!!

                                    -భార్గవి
                                   29/05/13
ఆకాశం కూడా నిట్టుర్చే వేళ
కునుకు వాలని
రెప్ప చప్పుడు
తట్టి మేల్కొలిపింది నన్ను!
గుట్టు చప్పుడు కాకుండానే
గుండెలో పెను ఉప్పెనెగసి...

వేల నిట్టుర్పుల చాటు
గుండె కోతను ఆపే
కమ్మనీ మంత్రమైన నా కవిత!
మౌనంగా తనని పెదవి గడప
దాట నివ్వట్లేరని తెలిపింది!

కంటబడిన కలం
నక్కి నక్కీ చూసి
వెక్కి వెక్కీ ఏడ్చి
దిక్కు తోచక
గుండె ముక్కలయ్యింది!!
                                     -భార్గవి
                                    23/12/2012

Sunday 9 June 2013

నీడలు

చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘం భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా
వీళ్ళందరూ సగం సగం మనుష్యులు
మరోసగమ్ మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం, భాగవతం చదువుతారు
పాపం,పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విధ్యాధికులు విధూషకులు
తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
ధారిపక్క నిల్చిన మోడుచెట్ల భాధని అనువదించాలి
పచ్చికలో ధాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యా గగనం రుథిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, ఇల్లేమో దూరం
చేతిలో దీపమ్ లేదు, ధైర్యమే ఒక కవచం
-దేవరకొండ బాల గంగాధర తిలక్
అమృతం కురిసిన రాత్రి 

Saturday 8 June 2013

ఏమిటీ వింత భయాలు మనుషుల మధ్య...?!
ఎందుకీ అంతరాలు  మనిషికీ, మనసుకీ మధ్య...?!

మనసుకోసం మనిషి చచ్చి బ్రతకాలా?
మనుషుల కోసం మనసు చంపుకుని బ్రతకాలా?

అహం వచ్చి అనురాగాన్ని సాగనివ్వట్లేదు.
నేను అనేది వచ్చి మనుషుల మధ్య
మన అనుకున్న మనసులను, మనుషులను వేరుచేస్తోంది!!

నువ్వు నువ్వుగా, నేను నేనుగా మిగలడానికి...
మనం అన్న ఆప్యాయతను...
అందులోని అనురాగాన్ని...
వెతకాల్సిన అవసరం లేదు!!

కంప్యూటరులో, సెల్ఫోన్లో ఉన్న పేర్ల మీద అభిమానం!
మొహం కూడా పరిచయం లేని
మనుషులతో స్నేహం!
రూపం చూసి, డబ్బు చూసి
కార్లో ఉన్న మనుషులంటే ఇష్టం!

ఎక్కడున్నారు మనవాళ్ళు??
ఎక్కడ పుట్టుకతో ననను ఎరిగినవాళ్ళు ?!
బంధుత్వాలు కూడా అహానికి బానిసలైపోతున్నాయి!
చుట్టరికం డబ్బుకు కట్టుబడిపోతుంది!!

నా చెల్లి, నా అన్న...
బాబాయి, అతయ్య , ఆమ్మ, నానమ్మ, మామయ్య , పిన్ని,
అనే పదాలు ABCDల తో పాటు పుస్తకంలో
చూసి నేర్చుకోవాల్సి వస్తుంది!
వరసలు తెలీవు! బంధుత్వం అస్సలు తెలీదు!
మనవాళ్ళతో కలిస్తే ఉండే ఆనందం తెలీదు!

పండుగలు, పబ్బాలు, ఎపుడో పోయాయి!
అవసరానికి పనికొచ్చే మనుషులతో
పార్టిలు మాత్రం మిగిలాయి!!

అన్ని బంధాలను పెనవేసుకుని...
బంధుత్వపు రుచి చూసిన వాళ్ళకే
తెలుస్తుంది అనురాగం విలువ!

సూరీడు సుక్కై పొడిసే....!
ఎన్నెలే దిక్కై మెరిసే... 
ఏ దిక్కు పోవాలంటే 
కన్నులూ నీళ్ళే గురిసే...!!

సిత్రమేందో గాని 
సిన్కు సిన్కు గురిసి
నాప సేనూ తడిసి
చేనులో మొలకొచ్చే!!

జాతరలు జేస్కొనీ
సంకురాతిరి కొరకు
సంబరంగ సూస్తుంటే 
వడగండ్ల వానొచ్చె!!

పంట సచ్చీపాయె!
అప్పు పెర్గీపాయె !
పాడు బతుకుకు
ఇంక సావు రాకపాయె!!

నా నావ తీరం దప్పి 
నడి ఏట్ల గొట్కపాయే... 
ఈ రాత రాశినోడు 
బెమ్మయ్య గానరాకపాయే!!