Friday 30 August 2013

భార్గవి/ అడగాలని ఉందమ్మా ఒక్క మాట-1 / 30/08/13

అమ్మా!
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అమ్మతనంఅంటే ఇదేనా...?
పాపగా ఆనాడు అడగాలనుకున్నా...!
అమ్మని అడుగుతున్నా నేడు!
అమ్మతనమంటే ఇదేనా...?

పల్లెత్తు మాత పలకలేని పసిమనసు
నీకింకా బోదపడలేదా అమ్మా!
చందమామ వద్దు నాకు!
అమ్మ ప్రేమ కావాలని
ఈ చిన్నారి మాటలు
నీ చెవి సోకలేదా అమ్మా!
ఒక్కసారి ఒడి చేర్చుకుని
గోరుముద్దలు పెడతావని
ఎదురు చూసిన కళ్ళలో
సెలయేళ్ళు దాచుకుని 
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అర్ధం చేసుకుంటావుగా!

నువ్వు పంతానికి పోయి
పడకల దాకా లాక్కుని
ముడేసిన బంధం ముచ్చటగా
తెంచుకుంటూనే...
ముడులు ముడులుగా
విలువ తెలుసుకోవడానికేనా
ఈ పెనుగులాట...?
ఎడాపెడా మాటల తూటాలు పేల్చి 
ఎవరి దారి వారు వెతుక్కుంటే
నా గతి ఏవైపో...
చూపించే నాథుడెవరో...
తెలియని సందిగ్ధతలోనే
నేనున్నప్పుడు

ఎన్నో చేతుల ఓదార్పులతో 
చుట్టూ అల్లుకున్న
ముల్లకంచెలను విధిలించుకుంటూ
చీరుకున్న గుండె
రక్తం చిందిస్తూ
కనిపించని నిజాల కోసం
అబద్ధాల ముసుగేసుకుని
ఎదలో నాటుకున్న
కొడవళ్ళు దాటుకుంటూ
నిద్రలేని రాత్రికెన్ని
నిజాలు దారపోసానో తెలుసా...?!
అడగాలని ఉందమ్మా ఒక్క మాట!
అమ్మతనంఅంటే ఇదేనా...?

Sunday 25 August 2013





Tiny Femto : 
కాటుక కన్నుగీటకు! నే తెల్లకాగితాన్ని!!
Trendy Femto:
తెల్లకాగితం నాహృదయం 
కన్నుగీటకు... నీ కాటుక కళ్ళతో!
26 Aug 13

Saturday 24 August 2013


భార్గవి/ బాల్యమా ఒక్కసారి తిరిగిరావూ..

అమ్మో...!

గాయాలేం తొలచటంలేదేంటో... 
ఎపుడు గడచిపోయిందో కాలం 
కళ్ళముందు కాంట్రాస్ట్ కలలా కదలాడుతోంది!
చిన్నప్పుడు ఇంటిముందు సందులో 
గాలీ దుమారంలో ఆడుతుంటే 
పీల్చిన మట్టివాసనింకా వస్తూనే ఉంది
సన సన్నటి వాన చినుకులు 
ఎడతెరిపి లేకుండా కురుస్తుంటే 
ఎవరేడుస్తున్నారా ...?! ఇంతసేపు 

అనుకుని చిరాకేసేది!
అప్పటి నా కన్నీళ్ళను ఆ చినుకులు 
కప్పేసినపుడు ఆనందమేసేది!
చల్లని చినుకులను నిండుగా 
గుండెకు హత్తుకునేదాన్ని!
వాటికి తోడు 
ఆకాశంలో ఉరుములు, మెరుపులూ... 
ఇత్తడి లంకె బిందెలను ఎత్తుకుని 
మువ్వలు కట్టుకున్న ఎడ్లబండి 
సాగిపోతున్నట్లు వినిపించేవి
వీధి వీధంతా కలయచూసి 
వానల్లో స్నానం చేస్తున్న కప్పలమీద
విసుగ్గా రాయి విసిరేదాన్ని!

వర్షం వచ్చిన రాత్రి(చందమామ)బూచిమామ 
ఆకాశంలో మబ్బుల చాటున దాక్కుని 
 అప్పుడప్పుడు నవ్వుతూ 
మెరుపులతో ఫోటోలు తీస్తుంటే 
నేను తప్పించుకు తిరిగే దాన్ని!!

ఎప్పుడు గడచిపోయిందో కాలం!
గిర్రున తిరిగి తిరిగి వచ్చి 
కంటిపాప చాటునుండిపుడు
నక్కి నక్కి చూస్తోంది!
చుట్టూ చీకటి చూడగానే 
బాల్యం బిక్కు బిక్కుమంటూ 
కాలాన్ని కప్పుకుని నిధ్రపోయిందట!
బాల్యమా ఒక్కసారి లేచి తిరిగిరావూ...!
అదే మట్టితో మళ్ళీ ముచ్చట్లాడుదాం
జారిపోయిన ఊసులన్నీ గాలం వేసి పట్టి 
గుండెలకు అతికించుకుందాం!!

.   24/08/13






గతాన్ని పాతిపెట్టా...! ఇప్పుడు ఇంగితం ఉంది
24/08/13



ఇరుకు బతుకులు మనవి!
ఇమడలేని సాగరాలు పోటెత్తుతాయి!!
24/08/13

Friday 23 August 2013


ఇన్నాళ్ళ నా కన్నీళ్ళు
దారపోసింది ఈ ఎండమావికేనా?
24/08/13



చూపుల బాణాలేస్తా!
నీ ప్రతి కదలికనూ ముడేసి బంధిస్తా!
24/08/13

Thursday 22 August 2013



గుప్పిట్లో ఒదగలేవు గుట్టు దాచలేవు!

Wednesday 21 August 2013



కనువాకిట కోవెల కట్టి 
హృదయంలో దీపం పెట్టి ప్రణయం కాదంటావా?!



కరువొచ్చింది కన్నీళ్ళకు 
కాలం చేసే అలజడులకు...

Saturday 17 August 2013


భార్గవి/ 17/08/13

నీకై వెతికే నిరీక్షనలో...
ఎద గుమ్మం దాటలేని ఆశలు!
చుక్కల్లో చిక్కుకున్న చూపుల్లో 
అవి రెక్కలున్న సీతాకోక చిలుకలు!!

వాన చినుకుల దారాలల్లి
చూపులతో చిలుకుతున్నా!
అకుంఠితమైన ఆనందపు
వెన్నెల వెల్లువ పొంగి
దట్టమైన మేఘాలు కమ్మి
పగిలిన హృదయంలా
హోరు గాలి వీస్తుంది!
పరుచుకున్న దు:ఖంలా
జోరుగా జడివాన కురుస్తుంది!!

తనకు తాను పాదు చేసుకుని
నీరు తోడుకున్న మొక్క
నన్ను చూసి ఫక్కుమంది!

అడగమన్న అడుగు
ఆగమన్న పరుగు
వీడని వీసమంత వింత
ఎందుకు ఎందాకని
నీ ఎడారి ఏకాంతపు పంతం
ఎందాకో ఎగరలేదు
తడిసిన నీ తలపు

సందేహపు సందేశం
సాగలేదిక సాంతం!!
ఆపలేని ఓపలేని
ఆవిరైన ఉచ్చ్వాసలను
వేగంగా వెళ్ళనీ...
గొంతు నులిమి పట్టకు 
అవే నాకు ఊపిరులు...

ఎద గుమ్మం దాటలేని ఆశలు!
అవి రెక్కలున్న సీతాకోక చిలుకలు!!
రంగుల వసంతం
పూసుకున్న తలపులు
అవి తెరవమన్నాయి
ఆలోచన తలుపులు...

రేపటి కలల రెక్కలిచ్చి
ఇవాళ్టిలోనే బంధించావేం...??


Friday 16 August 2013


భార్గవి/ తెల్ల కాగితాలైపోయాయి మనసులు!!

ఎక్కడో బూజు పట్టిన
గాజు పెట్టె కింద దొరికిందో పాత పుస్తకం!
తెరచిన పేజీల సందు నుండి
జారిపడ్డ నీ జ్ఞాపకాలు! వాడిపోయిన పూలు...!
జీవంగా లేక, శవం కాలేక
నిరీక్షిస్తున్నట్టు నాకోసం
కాలంలో చెదిరిపోయిన నీ సంతకం కింద నా నవ్వులు
పాత కాగితపు వాసనతో
పరిమళిస్తూనే ఉన్నాయింకా!!

ఎన్నో స్పర్శల్లో పడి నలిగిన చిహ్నమిది!
ఇప్పుడలాగే నా చేతిలో
నన్ను ధాటేల్లిపోయిన
22వ మెయిలు రాయిలా
కళ్ళముందు అంతకంతకూ సాగిపోతోన్న దూరం లో
అస్పష్టమవ్తున్న కాలపు చిత్రంలా
అడ్డుకట్ట వేయలేని
ఆనంద బాష్పాలకు
మనసు నిండి
నిశ్శబ్దపు హద్దులు దాటి
ఆరాధనలీవేళ ఆవేధనలై పొంగి
నిలువెత్తున తడిపేసాయి
నీ జ్ఞాపకాలను!
మౌనంగా నీ మదిని
గిల్లుతోన్న నీ అల్లరిని
పగులగొడుతూ నీ నవ్వు ఇపుడు...
ఖాలీ అయిన చేతుల్లో
ఒంటరితనపు భారం దించుకున్న గురుతులు!
నీవ్రాతల్లో ఒంపుఒంపుకూ
ఎన్ని కొంటె చూపులో!!
కాగితం మలుపుల్లో
ఎన్ని అర్ధంలేని కొట్టివేతలో...
మలుపు మలుపులో మానలేని
గాయం చేసుకున్న మన వాక్యాలు
సావాసం వదులుకుని,
సమాధానం మానుకుని
పదాలైపోయి మిగల్లేని అక్షరాలుగా...
తుది ఆనవాలుగా
తెల్ల కాగితాలైపోయాయి మనసులు!! 
           
                               16/08/13

ఆరు క్షణాలెత్తు జగత్తు!
రెప్ప పాటు నుదుటి రాతలొత్తు!!

స్వీటు స్విటుగా సీటొచ్చేస్తే 
కడుపు కాలినా మెతుకు దొరకదు!
16/08/13
=======-
రెక్కలు తెగిన తుమ్మెద...
========
నర నారాన మదమెక్కిన 
కోరికల గుర్రాలకు 
నీ కౌగలి అందమైన కళ్ళెం

పంటి గాట్లన్ని
తళుకుల మధ్య దాచేసి
కడిగిన ముత్యం లా ....
మరో మృగానికి ఏర గా...

నీ తనువంతా కాలిపోతుంది
అయినా వాళ్ళ ఆకలి
మంటలని ఆర్పడానికి ...
అయిన కూడా
ఆవిష్కరించు కుంటావు కొత్త గా....
నిన్ను నువ్వు .ప్రతి రోజు ...

దీన జనోద్ధరణ అవతారమెత్తిన
పేరున్న ముఖాలు అంతా ...
చీకటి ముసుగేసుకొని
బిరా బిరా నీ వాకిలి లో ...కి

ప్రేమ వల విసిరి నిన్ను పట్టి ,
నది బజారు లో వేలం వేసినప్పుడు
"బలవంతపు" చెరసాలలో బందివి నువ్వు.

రక్త మాంసాల ..ముద్ద తో ....
వేటాడి....వెంటాడి
చితికేక్కించిన
సమాజపు దౌర్జ్జ్యన్యం ఫై
ఉమ్మేయాలని వుంది కదు ...

శ్లోకం లో కన్పించే నిజాన్ని
అబద్దం గా మార్చి
శోకం లో కి నెట్టేసిన
అహంకారాన్ని నిలదీయాలని వుంది కదా ..

ఇప్పుడైనా ...మేలు కో ...
మానపు విలువ తెలియచెప్పే సమయం ఇది.
చితికి పోయిన నీ బతుకు సాక్షి గా ....

//సాగర్// 15Aug13

Thursday 15 August 2013



స్వాగతించినా, సాగనంపినా నువ్వే కదా!!
16/08/13




చెరిగిపోని నీ సంతకం!
చెదిరిపోయిన నాకు సంకేతం!! 

1మీరెందుకు కల్తీ అవడం
  ఖాలీ కడుపు అరువు తెచ్చుకోండి దీక్షకు!

2 మౌనంతో మనసు కడిగేసా!
   ఇంకా నీ అడుగుల మరకలు వదల్లేదు!!

Wednesday 14 August 2013

ఎరిగావా బాటసారి...
ఏదో నువ్ నడిచే దారి!!

Sunday 11 August 2013


పేగులు మూతి ముడుచుకున్నై!
అలకా కాదు, ఉధ్యమమూ కాదు, ఆకలట!!
12/08/13

పేదోల్లందరూ జీరో సైజ్!
మనదేశం ఫిట్నెస్ మెంటేన్ చేస్తుంది!
12/08/13
నా శ్వాస సడి...
నీ గుండె చప్పుడు.... చప్పట్లు కొట్టుకుంటున్నాయి!


అది అంతా ఇసుక
చరిత్రలో ఒక మసక!
-పాడువోయిన ఊరు కవిత నుండి 


గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర!
వర్తమానం కన్నులగప్పిన ఒక పొర !!




అక్షరాలు కళ్ళలో ముద్రిస్తూ...
కన్నీరొదిలేస్తావేం....?! అందులో నే జారిపోతా...!

Wednesday 7 August 2013

గుండెలపై తొక్కుతూ 
ఎదిగావు కన్నా! గూటిలో చోటులేదంటావా!?
08/08/13, 12:50

వి"నాయకా"...!! అండ అనుకుంటే 
నెత్తురు పీల్చే నల్లిలా ఉందే నీ తొండం!!
07/08/13
నీ చూపు సోకడానికైనా... 
కాగితంపై అక్షరాన్నవుతా!!

07/08/13
ఎన్ని పున్నములు వీక్షిస్తున్నా...
నా నిరీక్షణ నీకై కృష్ణపక్షంలో... !!
07/08/13
మనసు ఎంత చంచలమైనది...!
అనంతకోటి విశ్వం లో అడ్డూ, ఆపూ లేని
గాలినైనా బంధించగలం కానీ...
మనసు దారి మళ్లించటం
మౌనానికే సాధ్యమేమో...!!
-భార్గవి

Monday 5 August 2013

కన్నీటి జల్లు కాస్త జల్లు!
నవ్వుకొనో...?! నవ్వుతూనో...?!!
నీ అడుగు మడుగులో పూచిన కలువ నేను!


Sunday 4 August 2013

నిద్రలేని రాత్రి...
నిధ్రావతి ఎదపై నిశాచరిలా నేను!!

Thursday 1 August 2013


నువ్వు-నేను అనుకంటే ఒకే ఇంట్లో ఉన్నా నువ్వు నువ్వుగా, నేను నేనుగా బ్రతకాల్సిందే!
మనం అనుకున్న నాడు గదులు వేరైనా మదిలో కట్టుకున్న గూడు చెదిరిపోదు!