Friday 17 January 2014

ఆకాశం ఏంటో...
వింతగా ఉంది ఈ పూట!
నాకోసమే వెతికి
నవ్వుతున్నట్టుగా ఉంది
ఈ చుక్కల తోట!
దారి తప్పావోయి బాటసారీ... అంటే
వేలు పట్టుకుని నడిపింది నువ్వే కదా!

ఈ బాటెంట వొస్తే నీ దాహం తీరేదెలా?!
ఎదురేగే అనంతానంత
ప్రహేళికా మేఘాలు నన్ను ముంచెత్తినా
వసంతాలు, గ్రీష్మాలూ
నన్ను దాటెళ్లి పోయినా...
ముళ్ళ దారి వెంట చీకటి ప్రయాణం
ఎన్నాళ్లని సాగించను చెప్పు...
ఎడారైన ఎదలో
నవ్వుల వర్షం కురిసి
ప్రేమ సంద్రంలా మార్చేస్తావు మది
మరు క్షణంలో మర్చిపోవటం నేర్పించి
ఆవిరి చేస్తావు ఆశల్ని...
నీ పిలుపుకోసం ఇంకా ఈ బురదగుంటలోనే
చితికిపోయిన మనసు మజిలీ
చితి కి పోయే వరకూ ముందుకో, వెనక్కో
సాగుతూనే ఉంటుంది పాదం!
నాకు తెలుసు!
నా దారినే ఎదురొస్తావని
దరి చేరడానికో, కడతేర్చడానికో...
ఈ దిక్కు తోచని స్థితిలో
నీకోసమే కాదా అన్వేషణ...

~ భార్గవి
17/01/14

No comments:

Post a Comment