Thursday 31 October 2013

భార్గవి/ ఏమనాలో...?!!

ఎగుడు దిగుడు నేల మీద
పాలపుంత లాంటి
కోవెల కట్టుకుంటావు
నువ్వే...! నీకోసమే...!
కొలువుదీరి
కళ్ళు మూసుక్కూర్చుంటావు
ఏమని పిలవాలో కూడా
తెలీదు మరి
ప్రశ్నించడానికి కూడా
ప్రశ్నే ఎదురవుతోంది నాకు!
అంతరాత్మవో...,
అనంతానంత లోకాలకావల
విశ్వమెరుగని శూన్యానికి అధిపతివో...?!
ఆకారం ఉండి జీవం లేని రాయివై
ముక్కలు ముక్కలు చేసుకుని
శరీరమంతా గుప్పెడు మట్టితో
సృష్టికంతటికి ప్రాణం పోసి
జీవం మాత్రం కోల్పోతున్నావ్!

పగలు రేయీ అంటావ్
ఏ అంచుల్లో దాక్కుంటావో...!
ఏ రంగులో అద్దుకున్నవట కొత్తగా
మునుపులేని పరిమళాలు
ఉన్నాయట నీకిప్పుడు
కాలాలు లెక్కకట్టి
కొల్చుకుంటున్నారు నిన్ను
బంగారపు కిరీటాలు,
పులిహోర, దద్ధోజనం
కొండ మీద పెట్టి కాకుల్లా
రాకాసి నాలుకలతో లోకులు
తమ వాదం నెగ్గించుకుంటారు

కాల పంజరం లో జాతకాలు
పలికే చిలకవని చెప్తారు!
శవాలన్నీ పోగేసుకుని
ఒల్లోకొచ్చిన పిండానికి
ప్రాణం పోశావంటారు
తలెనుక దీపమ్ పెట్టి
ప్రాణం తీశావంటారు!
దీపమ్ పెట్టి వరం అడుగుతారు!
దీపాలార్పి నీకే శాపం పెడతారు!!

యుక్తివి ఒక దివస్సులో
చైతన్యానివి ఒక తపస్సులో
ఏమనాలో...?!!
పిలవడానికి పేర్లు
బోలెడు అతికించారు నీకు!!
ఏది ఎంచుకోవాలో
సత"మతం" నాకు!!

మేలు చేస్తే వేలుపువి!
కీడు చేస్తే ధయ్యానివి!
చిత్తం చెప్పినట్టు చేస్తే మనిషివి!!

31 అక్టోబర్ 2013, 12:45


No comments:

Post a Comment