Thursday 19 September 2013

భార్గవి/ ఆగని పయనమెందుకో!

ఇరు సంధ్యల మధ్య
ఇరుక్కుపోయిన పయనం లో
పశ్చిమం వైపు ఆగని పరుగు ఎందుకో!
ఎంతో దూరం తోడు రాలేని
ఉషోదయంతో సంబరంగా
ఎన్ని ఎండమావులు దాటి
నడచినా...
నడి రాతిరిగా మారిన
ఎడారి ఆలోచనలు...
నన్ను ధాటిపోలేని
నాలోని గురుతులు
నన్నే చెరిపేసుకుంటూ
కొత్త వ్యక్తిత్వాన్ని
గీసుకుంటున్నాయి
తమకు తామే అయిన
జ్ఞాపకాలు......
నేను తలచుకోవట్లేనని
కలల కత్తులు పట్టుకుని
యుధ్ధానికి సిద్ధమయ్యాయి!

అలసిపోయాను అంతర్యుద్ధంలో
గుండె లోతుల్లో
చీరుకున్న గతం గురుతులు!
విడుదల కాలేని
స్మృతుల సంకెళ్ళతో...!
తెంచుకోలేని బంధాలు
యుద్ధం విరమించుకుని
ప్రాణాలు పోగొట్టుకున్న
క్షణాల శవాలను మోసుకుంటూ
నడుస్తున్న మనిషి కాని మరో ప్రాణిని!
మౌనంగా ఆకాశంతో మంతనాలు చేస్తూ
నడుస్తున్న దారి వెంట
తోడు రాలేని నీడలను
నిశిలోనే వదులుకుని
మూలుగుతున్నమనసు ఒకటి
అడుగు కింద తొలుస్తున్నా
ఉషోదయం కోసం
సాగుతున్న బాటసారిని!
ఇరు సంధ్యల మధ్య
ఇరుక్కుపోయిన పయనం లో
పశ్చిమం వైపు ఆగని పయనమెందుకో!

19/ 09/ 13
4:30 pm 

No comments:

Post a Comment