Wednesday, 13 April 2016

భార్గవి/ 13/04/2016

కాలం అడుగేయకముందే కూలిపోయింది వంతెన...
ఏ జ్ఞాపకమో లోయల్లో పడి పగిలిపోయింది
కాలం కూడా అదే మస్తిష్కంలో దూకింది
వెనకడుగేయలేదు!
ముందుకు దారి చేసుకోనూలేదు!

భ్రమలన్నీ లావాలా పొంగుతున్నాయ్
ఉబికివచ్చే సెగ ఉనికిని మింగేస్తుంటే
ఆవిరులన్నీ పేలి ఉషోదయం చేరుతాయ్...
సూర్యుడేమో నక్కి నక్కి నడిరాతిరి చూస్తాడు
నిద్రలేని కన్నుల్లో మంచు ముక్కలౌతాడు!
కాలం నాలో ఆగిపోయాక ఏ ఉదయం రాగలడు సూరీడు?!!
మబ్బు పట్టిన అకాశంలా అలోచన మాత్రం పారుతోంది

తిరుగులేని జీవితంలో...
వెలుగులేని జీవనంలో...
మోగలేని నా మౌనంలో...
ఆలోచనలో వెలిగే రంగులు చూసి
చిందులేసే కనులేవైనా...
మబ్బుకోసి దోసెడు తడి నింపుకోలేవా...?!!

Thursday, 28 January 2016

అమావాస్య అర్థరాత్రి
అథ:పాతాళాన్ని తోలిచేందుకు
అంతరాత్మ పొలిమేరల్లోనే తచ్చాడుతుంటాడు
ఆలోచనలకు చీకటి గంతలు కట్టి
ఊహల లాంతరుతో
బయలుదేరాడు...
హృదయ తీరానికి!

ఒకనాటి ప్రేయసి వదిలెల్లిన
అడుగుజాడలను
చూపులతోనే హత్తుకుంటాడు
కంటి చివరే సగం జారిన
మంచు కత్తులతో
కూడదీసుకుంటాడు ఆ మట్టిని
అక్కడే రాలిపోయిన
స్పర్శలకోసం తపన వాడిది!
తడారిన గుండెలోతుల్లో
చెలి వెచ్చని నవ్వుల తేమ
ఇంకా ఉండే ఉంటుందని
తవ్విపోసుకుంటున్నాడు!

ఆ మట్టి మిగుల్చుకుంటావా?! అంటాన్నేను

ప్రతి రాత్రీ వాడి దారంట
పలుకరిస్తూ పోయే దుఃఖాన్ని నేను
వాడి గాయాన్ని వాడై తవ్వుకున్నాడు
వాడిలో వాడే సమాధైపోతూ
చీకటి చినుకులా పలుకరించిన నన్ను
సంద్రంలా నింపుకున్నాడు!
అంతులేని శూన్యాన్నైనా
జాలిగా వెతుక్కుంటే ఒడి చేర్చుకుని
జోలపాడటమే తెలుసు నాకు!
వెంట తెచ్చుకున్న
లాంతరు కూడా ఆర్పేసి
ఫక్కుమని ఓనవ్వు విసిరి
మట్టి కప్పుకు నిదరోతానంటాడు!
ఆణువణువూ చీకటి నింపుకుంటూ కలలై
మృత్యు కౌగిలిలో తలవాల్చుకుంటున్నాడు

Monday, 18 May 2015

నిజాలు సూదిలా గుచ్చినా బంధాలను కలుపుకుపోతాయి
అబద్దాలు కత్తెరలా పరిస్థితులతోపాటు బంధాలను కూడా కత్తిరించేస్తాయి!


Tuesday, 7 October 2014

వెళ్తున్నా...!

ఎక్కడి వరకు?
పగటికి పరదా వేసి
చీకటికి ముసుగు తొడిగేసి
ఏకాంతంలో మునిగే వరకూ...
శ్వాసల యుద్ధం ముగిసేవరకూ...
ఎందుకు?
కత్తుల వర్షంలో తడవలేక...
నెత్తుటి దారుల్లో నడవలేక...
 నవ్వులు రాలే చోట
నన్ను ఆరబొసుకోవడానికి!!

తోడు మరి??
నాతోపాటు కరిగిపోని జ్ఞాపకాలూ
కొన్ని నవ్వులు, కొన్ని ఏడ్పులు!

వాళ్ళ మాటల్లో సూదులింకా
మిగిలిపోయాయని గొడవ చేస్తున్నారు!
నాలుక చివర గుచ్చుకుని
 నాకు దారి వదలమని చెప్పు!

- భార్గవి
7/10/14

Tuesday, 23 September 2014

అడగాలని ఉంది ఒక్కమాట!

అమ్మా...!
అడగాలనుంది ఒక్క మాట!
అమ్మతనమంటే ఇదేనా...?!
అమ్మంటే అనురాగ దేవత
ఆప్యాయత ప్రతిరూపం అని
బల్లో, గుళ్ళో చెప్థారట
మరి ఏఒడి పంచుకుంటుందో
హామీ ఎవరూ ఇవ్వటంలేదేంటమ్మా?
ఎందుకంత ప్రేమమ్మా నామీద
ఒల్లో చేరకముందే
గర్భ గుల్లోంచి వెలివేస్తున్నావు నన్ను
దేహపు దాహం తీర్చుకోవడానికి
పసిమొగ్గల్లో కూడా
మకరందం వెతికే
మదమెక్కిన జోరు తుమ్మెదలున్న ఈ తోటలో
పూవునై నేను పరిమళించలేనని
మొగ్గగానే తుంచేస్తున్నావా అమ్మా?

నా గుండె చప్పుడు వినమనే మాట
ఏ ఒక్కనాడైనా
నీ చెవినేయగలిగానా?!
నా భావాలు నాలోనే
నిక్షిప్తం చేసుకుని నిర్లిప్తంగా
చూస్తుండిపోయాను కానీ...
నీ కడుపులోనే
కరిగి కరిగి చిద్రమవుతున్న
నా రక్తపు ధారల వాసన
శ్వాస తీసుకుంటూ
నాన్నకెందుకో అంత
స్వాంతన చేకూరుతుంది
అడగాలని ఉంది ఒక్కమాట
అమ్మతనం అంటే ఇదేనా?!

పగిలిన నా గుండె నెత్తురు
నీకంటనే జరుతోందమ్మా...!

నే దాటలేని చూపొకటి విసురుతూ
వేసుకుంటావు రెప్పల తలుపులు
అనురాగానికై పరితపించే నేను
గుమ్మం బయటే చూపుల
నెగళ్ళు పాతుకుని వేచి చూస్తాను!

దేహమడిగిన ప్రశ్నకు
సందేహం లేకుండానే
సమాధానం చెప్పావేమో!
మరి నా చూపుల్లోని
ప్రశ్న కూడా తెలుసుకుని
నువ్వే అడుగుతావా అమ్మా!

ఆడపిల్లనైన పాపానికి
పుట్టకముందే
పుట్టెడు మట్టితో
కప్పెట్టాలనుకుంటున్నారు
అమ్మతనం అంటే ఇదేనా అమ్మా?!
అడగాలని ఉంది ఒక్కమాట!
సమాధానం చెప్పమ్మా...!!
............................................................................................................................................................

అమావాస్య అర్థరాత్రి
అథ:పాతాళాన్ని తోలిచేందుకు
అంతరాత్మ పొలిమేరల్లోనే తచ్చాడుతుంటాడు
ఆలోచనలకు చీకటి గంతలు కట్టి
ఊహల లాంతరుతో
బయలుదేరాడు...
హృదయ తీరానికి!

ఒకనాటి ప్రేయసి వదిలెల్లిన
అడుగుజాడలను
చూపులతోనే హత్తుకుంటాడు
కంటి చివరే సగం జారిన
మంచు కత్తులతో
కూడదీసుకుంటాడు ఆ మట్టిని
అక్కడే రాలిపోయిన
స్పర్శలకోసం తపన వాడిది!
తడారిన గుండెలోతుల్లో
చెలి వెచ్చని నవ్వుల తేమ
ఇంకా ఉండే ఉంటుందని
తవ్విపోసుకుంటున్నాడు!

ఆ మట్టి మిగుల్చుకుంటావా?! అంటాన్నేను

ప్రతి రాత్రీ వాడి దారంట
పలుకరిస్తూ పోయే దుఃఖాన్ని నేను
వాడి గాయాన్ని వాడై తవ్వుకున్నాడు
వాడిలో వాడే సమాధైపోతూ
చీకటి చినుకులా పలుకరించిన నన్ను
సంద్రంలా నింపుకున్నాడు!
అంతులేని శూన్యాన్నైనా
జాలిగా వెతుక్కుంటే ఒడి చేర్చుకుని
జోలపాడటమే తెలుసు నాకు!
వెంట తెచ్చుకున్న
లాంతరు కూడా ఆర్పేసి
ఫక్కుమని ఓనవ్వు విసిరి
మట్టి కప్పుకు నిదరోతానంటాడు!
ఆణువణువూ చీకటి నింపుకుంటూ కలలై
మృత్యు కౌగిలిలో తలవాల్చుకుంటున్నాడు