Tuesday 23 September 2014

అడగాలని ఉంది ఒక్కమాట!

అమ్మా...!
అడగాలనుంది ఒక్క మాట!
అమ్మతనమంటే ఇదేనా...?!
అమ్మంటే అనురాగ దేవత
ఆప్యాయత ప్రతిరూపం అని
బల్లో, గుళ్ళో చెప్థారట
మరి ఏఒడి పంచుకుంటుందో
హామీ ఎవరూ ఇవ్వటంలేదేంటమ్మా?
ఎందుకంత ప్రేమమ్మా నామీద
ఒల్లో చేరకముందే
గర్భ గుల్లోంచి వెలివేస్తున్నావు నన్ను
దేహపు దాహం తీర్చుకోవడానికి
పసిమొగ్గల్లో కూడా
మకరందం వెతికే
మదమెక్కిన జోరు తుమ్మెదలున్న ఈ తోటలో
పూవునై నేను పరిమళించలేనని
మొగ్గగానే తుంచేస్తున్నావా అమ్మా?

నా గుండె చప్పుడు వినమనే మాట
ఏ ఒక్కనాడైనా
నీ చెవినేయగలిగానా?!
నా భావాలు నాలోనే
నిక్షిప్తం చేసుకుని నిర్లిప్తంగా
చూస్తుండిపోయాను కానీ...
నీ కడుపులోనే
కరిగి కరిగి చిద్రమవుతున్న
నా రక్తపు ధారల వాసన
శ్వాస తీసుకుంటూ
నాన్నకెందుకో అంత
స్వాంతన చేకూరుతుంది
అడగాలని ఉంది ఒక్కమాట
అమ్మతనం అంటే ఇదేనా?!

పగిలిన నా గుండె నెత్తురు
నీకంటనే జరుతోందమ్మా...!

నే దాటలేని చూపొకటి విసురుతూ
వేసుకుంటావు రెప్పల తలుపులు
అనురాగానికై పరితపించే నేను
గుమ్మం బయటే చూపుల
నెగళ్ళు పాతుకుని వేచి చూస్తాను!

దేహమడిగిన ప్రశ్నకు
సందేహం లేకుండానే
సమాధానం చెప్పావేమో!
మరి నా చూపుల్లోని
ప్రశ్న కూడా తెలుసుకుని
నువ్వే అడుగుతావా అమ్మా!

ఆడపిల్లనైన పాపానికి
పుట్టకముందే
పుట్టెడు మట్టితో
కప్పెట్టాలనుకుంటున్నారు
అమ్మతనం అంటే ఇదేనా అమ్మా?!
అడగాలని ఉంది ఒక్కమాట!
సమాధానం చెప్పమ్మా...!!
............................................................................................................................................................

No comments:

Post a Comment