Friday, 25 October 2013

-భార్గవి/ పెళ్లి రోజు

ఆరు నెలలు సావాసం చేస్తే
వాళ్ళు వీళ్ళవు తారట!
మరి 60 వసంతాలు సావాసం
నేను నువ్వుగా, నువ్వు నేనుగా
మారుతూనే ఉండాలి!

జీవించటం అంటే
వసంతాలు పూయిస్తూ
వెలిగిపోవటమేనా?!
వనికి ఆమని అలంకారం మాత్రమే!
జీవితం కళకళలాడడానికే
ఈ వేడుకలు!!

ఋతువులు మరుతాయ్!
గ్రీష్మాలు వస్తాయ్!
వేసవి వేళల్లో వేడిగా
నిట్టూర్పు గాలులు వీస్తాయ్!
ఆకులూ రాలే కాలంలో
తీరని ఆశలన్నీ
ఎండుటాకుల్లా అసహనంగా
రాలిపోయి మనసును
ఎండిన మోడు చేస్తాయ్!
అప్పుడంతా నిర్మలమైన
నిశ్శబ్దం కమ్ముకుంటుంది
కొన్ని ఆలోచనలు
సుడులు తిరిగి
మనం అనే పదాన్ని
అట్టడుగు నిరీక్షనలోకి తోసేస్తాయి!
ఇంకొన్ని ఆలోచనలు
విశ్వాసాన్ని శ్వాసించి
రాలిపోయిన ఆశలన్నింటిని
చెరిపేసి మనసును
తేలిక పరుస్తాయి!
గుండె నిండా గూడు కట్టుకున్న
చల్లని,నల్లని మబ్బులన్నీ
ముసురుకుంటాయి మనసును!
కాలాలు మరుతాయ్!

వాడిన లతలు చిగురించి
బంధాలల్లుకుంటాయ్!
పల్లవులు పలకరిస్తాయ్!
తిరిగి తిరిగి వసంతం వీస్తుంది!
మనోహరంగా మౌనం కుసుమిస్తుంది!!
పల్లవులు పలకరిస్తాయి!
ప్రాణం పచ్చగా పరవశిస్తుంది!

కాలాలు మారుతాయ్!
విరిగిన నవ్వులకు మళ్లీ
రెక్కలు మొలుస్తాయ్!!

-24/10/13

Thursday, 24 October 2013

విశ్వ రహస్యాలు తర్కిస్తున్నామంటూ
వెగటు వెగటు మాటలు చెప్తూ...
మీలో...
వెర్రి తలలేస్తున్న నాగరికత అంతా
చింపుకున్న జీన్సు ప్యాంటుల్లో...
రంగెలిసిపోయిన బట్టల ఫాషన్లో...
పార్టి టైం అంటూ పబ్బుల్లో పడిన
పదహారేళ్ళ కుర్రాడి షర్టు జేబుల్లో...
విచ్చలవిడిగా విర్రవీగుతోంది!!
ఇదే మన నాగరికత!
ఇదే మన అభివృద్ది!!

రోడ్డుకిరువైపులా
దారి మళ్ళకుండా
కారుకు దారి చూపించే
కనలిపోయిన కడుపుల
మైలురాళ్ళను కొనకంట కూడా
పట్టించుకోకుండా చేయి విదిలిస్తూ
మొహం చిట్లించుకుని
షికార్లకు లక్షలు
కుమ్మరించటమే నాగరికత!!
మన ఆధునికత!
మన అభ్యుదయం!!

పెద్ద పెద్ద మాటలెందుకులే కానీ...
ఏదో పిల్లలు సరదా పడ్డారు అంటారా?
బరువు, బాధ్యతలు లేవు!
ఏం చెప్పమంటావ్ అంటారా?
అవునులెండి! మనకేం బరువు?
దేశాన్ని గాలికొదిలేసాక!
ఇంకేం బాధ్యతలు?!
ఆ గుండెలు మాత్రం భారం కావూ??
కాస్త దాన్నీ గాల్లో తగిలించండి!
బరువూ, బాధ్యతా రెండూ తీరిపోతాయ్!!
 

కన్నెత్తి చూడలేదన్నావ్...!
కనుమరుగై కాలమంతా నిండిపోయావ్!!
-Bhargavi 
20 Oct 13

రాలిపోతున్నా నేస్తమా...!
నీకో వసంతం ఇవ్వడానికి...!!
23/10/13

Femto


చినుకై హత్తుకున్నావ్ 
చిగురు తొడిగాను! వసంతం పూయిధ్ధామిక!!
23/10/13

Wednesday, 9 October 2013

భార్గవి/ నా కవిత 

తానెవరో...?!
చూపు మరల్చలేని 
చూపులు చల్లుతోంది...
నే చలిన్చనంటునే
వలపు జల్లులలో
తడిసి మురిసిపోతాను
స్మరిస్తూ తననే,
స్పృశిస్తూ తన కలలనే,
నేను చూస్తుంటే..
ధ్వనిస్తుంది!
మౌనమై
పిలుస్తుంది!
రెప్పలార్పకుండా
చూపులకంటించుకుని
ఆడిస్తుంది!

నా కనుల పుస్తకంలో
జీవిత పాఠాలు లిఖిస్తుంది !
మరి కలల్లో..
మధుర కావ్యాలు
పఠిస్తుంది!
అవే కలల్లో
తప్పిపోతానేమో అని
కంటిపాపకు అంటించుకు
తిరిగింది!

అదొక వదలలేని
వ్యసనమైపోయాక...
తిరిగి చూస్తున్న నాకు
తిరిగి రాని కాలమొకటి
తెరవేసి
తోలుబొమ్మలాటలో
జథలేని వ్యథలా
నీడలా వదిలేసి
వెళ్ళిపోతుంది!!
చుక్కల్లో దారితప్పి,
జాబిల్లిని చేరి
వరదగూడు ఊయల కట్టుకుని
నిద్రపోయింది!!

అక్షరాల సంకెళ్ళలో
చిక్కుకుని నేను...
వెక్కిరిస్తున్న కలంలో
దాక్కున్నాను!!

- 09/10/13

Sunday, 29 September 2013



ఆకాశం కు(ఇ)రులు సవరిస్తూ...

నుదుట అధర సంతకం చేస్తున్న రవి!!
30Sep13