Friday 27 December 2013

భార్గవి/ నవ్వింది నా మనసు!

నల్లటి రాతిరి పొడిని రాసుకుని
ఎన్నాళ్ళకూ ఎలిసిపోని ఎన్నెల
మనసు నింపి దాచుకుని
వేదనొకటే తెలిసిన గుండె ఇది

నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!
పరదా చాటున
పరిచయం లేని దేహం
పరాయి కాదు నీకే రాత్రీ...!
ఎప్పటికీ ఎవరూ
చెరపలేని తెల్లకాగితానివి
తప్పులన్నీ తుడిచేసే
చీకటి నీడల్లో వెలయాలివి!!
అడుగు దూరంలో ఉంటావు
అందుకోలేను ఏనాడూ
అడగనీవు ఒకమాట!

చీకటి కౌగిట్లో చిక్కుకుని
కనుపాపలన్నీ ఉరిపోసుకుంటూ
ఒక్కొక్కటీ నీ ఊపిరితో
రాలిపోతున్నపుడు
మాటలు పెగలక నే
గొంతు నులుముకుని
శోకాన్ని దిగమింగుతుంటే
విందైన మాటల్లో నువ్
లోకాన్నే ఒంటరిగా విసిరేస్తున్నపుడు
నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!

చిరిగిపోయిన బ్రతుకు
మడతపెట్టి దాచి
సీల ఊడిన బండిని
చీకటితో బిగించి
పరుచుకున్న దారి
పల్లేరులని తెలిసి
భారంగా నిన్ను నువ్వు
ఈడ్చుకుంటున్నపుడు...
నవ్వింది! నా మనసు
వెర్రి నవ్వొకటి!!

27/12/13

No comments:

Post a Comment