Friday, 2 November 2018

పొద్దు పొద్దున్న పొగ మంచు అలికిన ఆకిట్ల
ఆవు కాడికి దూడనిడిసినట్టు...
నలుగు పెట్టి లాల పోస్తున్న అమ్మ తెలిసినట్టు
నిన్ను చూసి నే నవ్వుకుంటాను!
నీ గుండె పిలిసినట్టు
కృష్ణ పక్షం లో సందమావ మూతి ముడిసినట్టు
లేగ దూడ పాలు కుడిసిన సద్దుకు
పాణం గుండెనిడిసి గుప్పిట్లో ముడుసుకున్నట్టు
గుడిసెంతా కళ్ళు సేసుకుని
పున్నమి కురిసినట్టు
పందిరి మీద సిందులేస్తున్న మల్లి విరిసినట్టు
రేతిరంతా రేపు లేనట్టు మురిసినట్టు
మల్లె గాలి ముసిరినట్టు...
నిన్ను చూసి నే నవ్వుకుంటాను
ఒడిసిపట్టిన మెడ సుట్టూ
మడిసి పెట్టిన నీ చేతి కింద
నలుగుతున్న నా సెవుల్లో
గడుసు గుండెతో సిటికేలేత్తావు
మసక తుడిసిన గతం లో మసిని మరిసినట్టు
పడుసు కళ్ళిపుడు తడిసినట్టు
కునుకు కాటుక తీసి నీ బుగ్గ సుక్క పెట్టి
నిన్ను చూసి నే నవ్వుకుంటాను!
-భార్గవి
2/11/18
ఎక్కిలి నవ్వులు
ఎలితి మాటలు
ఎటకారాలు వద్దు...
ఎన్ని ఏషాలు అద్దు
ఏడుపే వచ్చి రుద్దు
ముసుగు మడుసులు రద్దు!
ఎన్నెలొచ్చినా
ఎండ కాసినా
ఇది ఏకాకి పయనం లెద్దూ!
ఎందాక ఈ మజిలీ గడిత్తే సాలు పొద్దు 

Saturday, 11 August 2018

చందమామ ముక్కను వెన్నెల్లో నంజుకు తిన్న
ఆకాశంలా సుషుప్తావస్థ లో ఉన్న నాకు
మునువు జన్మలో తప్పిపోయిన నీ కల...
హఠాత్తుగా నిద్రలేచి ఎప్పుడో ఎగిరిపోయిన మనసుకోసం
అద్దంలో వెతుకుతాను
మోడువారిన అడవిలో ఎండుటాకుల్లో
పూలకోసం వెతుకుతాను...
ఇన్నాళ్లు మౌనం మింగి కోమాలో ఉన్న మాటలన్నీ
పెదాలు విరుచుకుని దూకేస్తాయ్.
ఒక్కోమాట నాదికాక ఏ గుండె తీరానికో చెందినవని
తెలుసుకుని వేషం మార్చి
జ్ఞాపకాల ముసుగేస్తాయ్!
పూర్తిగా జ్ఞాపకాల రెక్కలు తెగిపోయాక
చివరి ప్రేమ చుక్క రక్తంలా ఇగిరిపోయాక
కాలానికి వంతెన కట్టి కొత్త రంగుల వసంతమై కురుస్తావ్
పరిచయాల మత్తు జల్లుతావ్
చెదిరిన స్వప్నానివో.. చేరిన గమ్యానివో...
ఎవరిచ్చారని హక్కు?
ఎదలో నూరేళ్లవరకు...!
-భార్గవి
11/08/18

Wednesday, 17 August 2016


ఈ తనువుదే ప్రయాణం
పల్లేరులమీద పడకలా
పన్నీటి జలకంలా
పగిలిపోయిన పీడకలలా
గుచ్చుకునే గుర్తులా
కాల్చేసే కన్నీరులా
నవ్వే నువ్వులా
నలిగిన నేనులా
మరపురాని
మళ్ళి రాని
కాలంలా
మానిపోయిన గాయంలా
ఎగిరిపోయిన స్పర్శలా
ఎటూ దారి దొరకని ఎడారిలో
ఎడతెగని ప్రయాణం!!

భార్గవి 18/08/16


Saturday, 30 July 2016

భార్గవి/30/07/16

నీ నవ్వుతో తీరిపోయే నొప్పికి
విరహం చేసిన గాయమేమిటో
బదులు రాని ప్రశ్నను మోయడం
ఎంత బరువో నీకేం తెల్సు
అంతరాంతరాల్లో నిర్లిప్తమై
వేల కాంతి యుగాలనుండి నిరీక్షిస్తున్న
కడలి నిద్రలేస్తుంది
నీ కౌగిలికోసం చాచిన చేతులతో
గడ్డకట్టుకుపోతుందలాగే...
ఉదయరవిచంద్రిక మోహనలో
తొంగి చూసినట్టు
కాసేపు ఉరుముతావ్
కాసేపు మెరుస్తావ్
చల్లగా కురుస్తావ్
వేయి వేణువుల స్వరాలు దాచుకుని
నిశ్శబ్ద గీతమొకటే పాడుతుంటావ్
కలవలేవన్న ఆలోచనతోనే
శిలైపోతుందీ  అల
విడిగా లేమంటావ్, విడిపోలేమంటావ్
నీలంగా, నిశ్చలంగా నవ్వుతూ ఉంటావ్
నీకోసం దాచిన ముత్యాలిక బయటికి రావు!
నిన్ను పొందే ఆరాటంలో నేను మాత్రం
కరుగుతూ విరుగుతూ
సుడులు తిరుగుతుంటాను
ఎన్ని తుఫాన్లు, సునామీలు చుసినా
నన్ను చూస్తూ.....
నాకోసం ఉంటావు!
ఆవిరైపోయే క్షణాన గుండెలో దాచుకోవడానికి ఆకాశమై...

Friday, 8 July 2016



నిన్ను చూసిన క్షణమేగా తెల్సింది
నా  ఇన్నాళ్ల లోటు తీరిపోయిందని...
ఆ ఒక్క నవ్వు చాలదా...
వేల క్షణాల నిరీక్షణంతా మరచి
నీలోనే మైమరచిపోవడానికి...
నీ  గుండె సవ్వడి వినేంత దూరంలో లేకపోయినా
నా మనసు సందడి నిరాకకోసమే అని
తెలిసినా  తెలియనట్టుంటావు
ముద్దుగా పిలిచినా బెట్టు చేస్తావోయ్
ముద్దపప్పూ.... 
రెండైనా ఒకటే 

ఒకే నీరు
చినుకులా
వరదలా
ఒకే నిజం
జ్ఞాపకం లా
కలలా
ఒకే రోజు
పగలులా రాత్రిలా
ఒకే మౌనం
శబ్దంలా
నిశ్శబ్దంలా
ఒకే మనిషి
నవ్వులా ఏడుపులా
ఒకే రంగు
నలుపులా, తెలుపులా
ఒకే ఆకాశం
విరగబూసిన వెన్నెల్లా
విరిగిపోయిన ఆశల్లా
ఒకేమేఘం
పగలబడినవ్వే మబ్బు చినుకుల్లా
పగిలిపోయిన మబ్బు వర్షంలా
ఒకే అవ్వ
అనుభవ పాఠంలా
అనవసర వస్తువులా

ఒకే జీవితం
నేనులా...
మనంలా...!!