Wednesday, 26 June 2013

తెలియదు నాకు

భార్గవి/ 25-6-13/ తెలియదు నాకు

తెలియదు నాకు!
నల్లని రాతిరిలో
వెలిగే పాపపు దీపపు
నీడలు పట్టుకు వేలాడే
మిణుగురు పురుగును నేను!!

రాకాసి రంకె వేస్తుందని...
బీటలువారిన నా ఊహల
తోటల్లో నెగళ్ళు పుట్టుకొచ్చాయని...
జ్వాలల్లో మిగిలిన గాలితోనే
బ్రతుకు పునాది వేసుందని...!
తెలియదు నాకు!!

గతం లేదని...
మరచిపోయాననుకుని...
చిరునవ్వుల గూడు కట్టాను!
గుండె దిగజారే భారం మోస్తున్నానని
తెలియదు నాకు!!

సులువు కాని బంధాన్ని
సున్నితపు నమ్మకాల దారంతో
అల్లుకున్నాను నేను!
సమ్మెట పోటుకు కూడా
అంతం సాంతం చవిచూస్తుందని
తెలియదు నాకు!!
          

Sunday, 23 June 2013

నీ కనులు చూడలేని లోతు
నా హృదయ సముద్రం!!
                          23/6/13
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
ఏదో గుబులు రేపుతావు
గుండెలోతుల్లోన!
పరుచుకుంటావు సంధ్యవై నాలో!
విరుచుకుంటావు విలయమై లోలో!!
ఏ క్షణంలో తొలకరివౌతావో ?!
ఏ మౌనంలో జడి వానౌతావో?!
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
కరిగిపోనీవు!
నీలో
కలిసిపోనీవు!
అలసిపోయాను
కానీ... 
అడగనివ్వవు ఒక మాట!
 తెలుసుకుంటావు
ఏదో...!
ఎంచలేనేనాడు
ఎవరు నువ్వంటే...
చెప్పగలవా చెప్పు
ప్రశ్న నేనడిగితే...!?
అర్ధరాథిరి వేళ
ఆవరిస్తావు నన్ను!
గుండె లోతులు తోడి
గుట్టు కాజేస్తావు!
నవ్వుతుంటావు!
ఏదో మూల
నక్కి ఉంటావు!
ముల్లులా...
గుచ్చుతుంటావు!
పూర్తికాని స్వప్నంలా...!
ఇంతకూ ఎవరు నువ్వు??
ఏమౌతావని నాకు??
భార్గవి/ 19-06-13

హవ్వా...!
నవ్విపోతారు!
చెప్పకు! నువ్వు నోరు విప్పకు!!
ఏమిటోయ్...! నీ మాటా... నువ్వూ...??

చీకటంటని చంద్రుడు
వెన్నెల పంచుతాడా?

పూల వాసనెరుగక
తుమ్మెద మజిలీ తీరుతుందా?

నింగినంటక కారు మేఘం
వర్షం కురిపిస్తుందా?

మట్టి తాకని చినుకు
మొగ్గ తొడుగుతుందా?

ఏం చెప్తున్నావ్ మరి?
అర్ధరాతిరి వేళ నాకు ఆశలఉరి బిగించి

బ్రతుకు నాదే కానీ
శ్వాస నీది ఇచ్చేయమంటావా?

తాపంతో ఉవ్వెత్తునెగసి
అలవై ఆవిరై నాలో చేరిపోతావు!

కారుమబ్బునై నాలో కలుపుకుని
చినుకునై నిన్ను చేరుతానంటే
పవనమై నన్ను సాగనంపుతావా?!

నేను లేని నిండుతనం నీకెలా సాధ్యం?

Thursday, 20 June 2013

స్వేచ్చాలోకం మనది

అవును మరి!
స్వేచ్చాలోకం మనది
నా కల కల్ల కాదని నేననుకోవచ్చు!
నీ మాట నెగ్గిందని నువ్వూ అనుకోవచ్చు.
ప్రేమ రాజ్యమేలుతుందని
పిచ్చోళ్ళనుకోవచ్చు!!

అవును మరి!
స్వేచ్చాలోకం మనది!
రాజ్యానికి రాజు, ప్రేమకు పిచ్చోళ్ళు
ఉంటె చాలుగా....!
మనిషీ, మనసూ
మాట, ముచ్చట
చాలుగా ప్రేమకు?!

నమ్మకాల సైనికులు
సహనాయుధాలు
ప్రేమ రాజ్యానికి రక్షణా మరి?
అంతే మరి!
స్వప్నావేశమ్ ఉంది రాజుకు!
మొహం దాహం వేస్తుంటుంది!!
ఎప్పుడూ గొంతు తడుపుతునే ఉండాలి
తపనల మత్తులో తూగుతూనే
ఉంటాడు రాజు!

అవును కధా మరి!
స్వేచ్చాలోకం మనది!
రాజే రాజ్యమేలుతాడని
ప్రేమే జీవితాన్ని నడుపుతుందని
చూసే కళ్ళు అనుకోవచ్చు!
మరి చెవులు వినేయొచ్చు!!

మంత్రి సలహాలతోనే తీర్పులుంటాయని...
అనురాగపు మంత్రి చేతిలో
రాజు కీలుబొమ్మనీ... అనుకోవచ్చు!
సగం కాకపోయినా సర్వస్వంలో
స్వార్ధంలో ఇమిడిపోయి
వద్దనుకున్నా, వారిస్తున్నా
నేనున్నానని సవరించే మంత్రి అనురాగం!
ప్రేమకు అహం దాహం పెరిగినపుడు
అనురాగం, అభిమానాన్ని నింపి
గొంతు తడుపుతుంది.

అవును మరి!
అనుకోవచ్చు...
ప్రేమ రాజ్యమేలే చోట
అనురాగపు మంత్రి ఉన్నా...
నమ్మకాల సైనికులున్నా...
సహనాయుధాలు ఎన్ని ఉన్నా...
నవ్వు, కోపం, బాధ, చిరాకు,
సుఖం, దు:ఖం, అవగాహన, ఆనందం,
అపనమ్మకం, అనారోగ్యం, ఆశ, నిరాశ
అన్ని రకాల ప్రజలుండాలి!
ప్రేమను సింహాసనంపై కూర్చోబెట్టి
ప్రేమించే, పూజించే, పట్టం కట్టే భావాలుoడాలి

అవును మరి!
అనుకోవచ్చు...
స్వేచ్చాలోకం మనది!
రాజభోగం చూసి రాజు కావాలని...
రంగుల లోకం చూసి ప్రేమ కావాలని...
సింహాసనం కోసం రాజ్యం కావాలనీ...
ఆకర్షణ నీడల్లో ప్రేమ వెతకాలని...
 అనుకోవచ్చు...

స్వేచ్చాలోకం మనది!
స్వప్నావేశమ్ ప్రేమది!!
అవును మరి!
నా కల కల్ల కాదని నేననుకోవచ్చు!
నీ మాట నెగ్గిందని నువ్వూ అనుకోవచ్చు.
ప్రేమ రాజ్యమేలుతుందని
పిచ్చోళ్ళనుకోవచ్చు!!


Wednesday, 19 June 2013

శూన్యంలో...

భార్గవి/ 08-06-13/ శూన్యంలో...

నేనునేనుగా నా శూన్యంలోకి అడుగిడతాను!
మరణ రాగం మెల్లగా సోకినపుడు...
మృత్యు గీతం నను లాగినపుడు...
నేను నేనుగా నా శూన్యంలోకి అడుగిడతాను!!

నిండైన నిశిలో నా నీడ అక్కడ...!
నుసియైపోయిన నా జీవన ప్రయాస అక్కడ!
నా కన్నుల్లో దాగి ఉన్న నిరాశలు అక్కడ!
కను కొలికి దాటి రాలేని నిజాలు అక్కడ!

అదే చీకటిని కాపలా చేసి
కనురెప్పల మాటున దాగిన జ్ఞాపకాలు అక్కడ!
మౌనంలో చిక్కుకున్న ప్రశ్నలు అక్కడ!

అన్నీ దాచుకున్నాను, భద్రపర్చుకుంటున్నాను.
ఏవీ...?! ఎక్కడ?!!
శూన్యానికి చేరుకున్నా...
ఇంకా వెతుకుతూనే ఉన్నా!
మరచిపోయానేమో!
వదులుకున్నానో మరి!?
చేజారిపోయుంటాయా?!!
ఎంత వరకు చేరినా 'నేను'
'అంత'o వరకూ 'నేనే'నా...?

నాపూర్వ జన్మ పరిమళాలు,
కోకొల్లలుగా జ్ఞాపకాలు, నిట్టూర్పులు
నిజాలు, నిరాశలు...
వేనవేల చూపులతో శూన్యంలో ఇమిడిపోయి అక్కడ!!
నాకోసం వేచి ఉన్న నా గతానుభవాలు అక్కడ!

నన్ను కూదా ఒధిగిపొమ్మని హాయిగా...
పిలుస్తున్న పిలుపులు...
అప్పుడు కానీ...
అక్కడ కానీ...
తెలుసుకున్నాను!
కలిసిపోయాను శూన్యంలో...
'నేను' అనే శూన్యంలో... !!