Sunday, 16 June 2013

నకిలీ నవ్వులు

నకిలీ నవ్వులు 

నకిలీ నవ్వులు!
నాలుగు...!
నాపరాళ్ళు పోగేసుకుని 
అందమైన అబద్ధం
కట్టుకుంటాడొకడు!!
తెల్ల కాగితాలు!
నాలుగు...!
తోచిన గీతలు గీసుకుని
పనికిరాని క(ళ) లను
కూడబెట్టుకుంటాడొకడు!!

మాటల మూటలు!
నాలుగు...!
నింగిని చుక్కలు చూపి
అవసరాలు
తీర్చుకుంటాడొకడు!!

నమ్మిన చేతులు!
నాలుగు...!
నీడనిచ్చే గుండెలను
ఏమార్చి, నిండుగా
నవ్వుకుంటాడొకడు!!

                                    -భార్గవి
                                   29/05/13
ఆకాశం కూడా నిట్టుర్చే వేళ
కునుకు వాలని
రెప్ప చప్పుడు
తట్టి మేల్కొలిపింది నన్ను!
గుట్టు చప్పుడు కాకుండానే
గుండెలో పెను ఉప్పెనెగసి...

వేల నిట్టుర్పుల చాటు
గుండె కోతను ఆపే
కమ్మనీ మంత్రమైన నా కవిత!
మౌనంగా తనని పెదవి గడప
దాట నివ్వట్లేరని తెలిపింది!

కంటబడిన కలం
నక్కి నక్కీ చూసి
వెక్కి వెక్కీ ఏడ్చి
దిక్కు తోచక
గుండె ముక్కలయ్యింది!!
                                     -భార్గవి
                                    23/12/2012

Sunday, 9 June 2013

నీడలు

చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘం భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా
వీళ్ళందరూ సగం సగం మనుష్యులు
మరోసగమ్ మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం, భాగవతం చదువుతారు
పాపం,పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విధ్యాధికులు విధూషకులు
తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
ధారిపక్క నిల్చిన మోడుచెట్ల భాధని అనువదించాలి
పచ్చికలో ధాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యా గగనం రుథిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, ఇల్లేమో దూరం
చేతిలో దీపమ్ లేదు, ధైర్యమే ఒక కవచం
-దేవరకొండ బాల గంగాధర తిలక్
అమృతం కురిసిన రాత్రి 

Saturday, 8 June 2013

ఏమిటీ వింత భయాలు మనుషుల మధ్య...?!
ఎందుకీ అంతరాలు  మనిషికీ, మనసుకీ మధ్య...?!

మనసుకోసం మనిషి చచ్చి బ్రతకాలా?
మనుషుల కోసం మనసు చంపుకుని బ్రతకాలా?

అహం వచ్చి అనురాగాన్ని సాగనివ్వట్లేదు.
నేను అనేది వచ్చి మనుషుల మధ్య
మన అనుకున్న మనసులను, మనుషులను వేరుచేస్తోంది!!

నువ్వు నువ్వుగా, నేను నేనుగా మిగలడానికి...
మనం అన్న ఆప్యాయతను...
అందులోని అనురాగాన్ని...
వెతకాల్సిన అవసరం లేదు!!

కంప్యూటరులో, సెల్ఫోన్లో ఉన్న పేర్ల మీద అభిమానం!
మొహం కూడా పరిచయం లేని
మనుషులతో స్నేహం!
రూపం చూసి, డబ్బు చూసి
కార్లో ఉన్న మనుషులంటే ఇష్టం!

ఎక్కడున్నారు మనవాళ్ళు??
ఎక్కడ పుట్టుకతో ననను ఎరిగినవాళ్ళు ?!
బంధుత్వాలు కూడా అహానికి బానిసలైపోతున్నాయి!
చుట్టరికం డబ్బుకు కట్టుబడిపోతుంది!!

నా చెల్లి, నా అన్న...
బాబాయి, అతయ్య , ఆమ్మ, నానమ్మ, మామయ్య , పిన్ని,
అనే పదాలు ABCDల తో పాటు పుస్తకంలో
చూసి నేర్చుకోవాల్సి వస్తుంది!
వరసలు తెలీవు! బంధుత్వం అస్సలు తెలీదు!
మనవాళ్ళతో కలిస్తే ఉండే ఆనందం తెలీదు!

పండుగలు, పబ్బాలు, ఎపుడో పోయాయి!
అవసరానికి పనికొచ్చే మనుషులతో
పార్టిలు మాత్రం మిగిలాయి!!

అన్ని బంధాలను పెనవేసుకుని...
బంధుత్వపు రుచి చూసిన వాళ్ళకే
తెలుస్తుంది అనురాగం విలువ!

సూరీడు సుక్కై పొడిసే....!
ఎన్నెలే దిక్కై మెరిసే... 
ఏ దిక్కు పోవాలంటే 
కన్నులూ నీళ్ళే గురిసే...!!

సిత్రమేందో గాని 
సిన్కు సిన్కు గురిసి
నాప సేనూ తడిసి
చేనులో మొలకొచ్చే!!

జాతరలు జేస్కొనీ
సంకురాతిరి కొరకు
సంబరంగ సూస్తుంటే 
వడగండ్ల వానొచ్చె!!

పంట సచ్చీపాయె!
అప్పు పెర్గీపాయె !
పాడు బతుకుకు
ఇంక సావు రాకపాయె!!

నా నావ తీరం దప్పి 
నడి ఏట్ల గొట్కపాయే... 
ఈ రాత రాశినోడు 
బెమ్మయ్య గానరాకపాయే!!

Thursday, 30 May 2013

నా తెనుగు భాష!

ఆకాశమంత అందమైనది
                       నా తెనుగు భాష!
అందులో నా ఆకాంక్షలు కాంక్షలై మెరిస్తే...
అది చూసే ప్రతి నయనం
                       ఓ కవితై పొంగుతుంది!
పులకించిన ప్రతి హృదయం
                      కవి కలమై వర్షిస్తుంది!!
                                            
                                         30/05/13
                                      భార్గవి కులకర్ణి
                          

Wednesday, 29 May 2013

24/3/2013

దేనికీ తృప్తి పడనివ్వదు!

ఎందులోనూ సర్ధుకుపోనివ్వధు!

కడతేరని ఆశల మేఘం 

కురిపించే కన్నీటి వర్షం 

నిను  తడపక మానదు!