Sunday, 25 November 2012

నా కవిత్వం - దేవరకొండ బాల గంగాధర తిలక్

నా కవిత్వం కాదొక తత్వం 
మరికాదు మీరనే మనస్తత్వం 
కాదు ధనికవాదం, సామ్యవాదం 
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజిపువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా  కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మ వీరుల కృత రక్త నాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు 

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

~1941
దేవరకొండ బాల గంగాధర తిలక్

అమృతం కురిసిన రాత్రి  


No comments:

Post a Comment