థాంక్స్ నాన్నా!!
ఆరేళ్లప్పుడు అడగ్గానే
పట్టీలు కొనిపెట్టినందుకు
పుట్టినరోజు నాడు టీవీ కావాలని మారాం చేస్తే
గారాలు చేసి రాత్రికి రాత్రి టీవీ తెచ్చేసినందుకు !
అష్ఠ లక్ష్మినే అష్ఠ దరిద్రం అయినందుకు
ఆడపిల్లనై నీ ఆశల్ని చంపినందుకు,
పదో తరగతిలో పుస్తకాలకోసం అర్థరాత్రిదాకా
నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినందుకు,
నాకో మంచి భవిష్యత్తు ఇవ్వమని
అడగలేని నా నిస్సహాయతకు,
రోజూ సరదాగా తాగేసి, వచ్చిందంతా తగలేసి
ఒళ్ళు తెలియని మత్తులో ఒంటిగంటకు వచ్చినా
శనిలా ఎదురొచ్చి వేడి వేడి అన్నం
తినిపించా చూడు అందుకు,
కారం ఎక్కువైందని తినే కంచాన్ని
తలకేసి కొట్టావు చూడు ఆ నీ మమకారానికి,
మూడేళ్ళుగా బకాయిపడ్డ ఫీజుకోసం
ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా
వెలివేసిన స్కూల్ నుండి ఇంటికీ, నీ ఆఫీసుకి
దూరమెంతో కొలవడం నేర్పినందుకు,
తిండి దండగని ఒళ్ళంతా వాతలు తేలేలా
కొట్టిన బెల్టు చేవలేక తెగిపడితే
కొత్త బెల్టు కొనివ్వలేకపోయానే అందుకు,
అన్నిటికి మించి
ఎగ్జామ్ ఫీజు కోసం ఆకలి చూపులకు
ఎరగా వేసావే ఆ రాత్రి అందుకు,
నరకాసురుని చంపారని అందరూ
దీపాల పండగ చేసుకుంటుంటే
నీ చేతుల్లో పడి నలిగిపోనందుకు
నట్టింట్లో దీపానికి నన్ను ఆహుతి చేద్దామనుకున్నవే
అందుకు,
చిరిగిన బట్టలతో' నలుగురి కళ్ళు వెంటాడుతుంటే
కంట్లో నీళ్లు కూడా జరానివ్వకుండా
పరిగెత్తిన క్షణాలకు,
ఏ ఒంటరి మేఘమైనా నాతోపాటు ఏడవకపోతుందాని
ఆకాశంలో చూపులు నాటేసి ఎదురుచూసినందుకు,
అంత చూస్తూ కూడా గొంతు పెగలని అమ్మకంటే
ఆ ఇంటి గోడకే తెల్సు నా గోడంతా
గుండె పగిలేలా ఏడ్చిన నిద్రలేని రాత్రులకు
చావుకెదురెళ్ళిన రోజులకు
నన్ను చచ్చేలా బ్రతికించిన
నువ్విచ్చిన క్షణక్షణ మరణాలకు,
అన్నీ నాకే ఇచ్చేసి నువ్ మాత్రం
ఇంకా హ్యాపీగా బ్రతికేస్తున్నావే అందుకే
హ్యాపీ బర్త్ డే టు యూ నాన్నా...
భార్గవి/ 8/7/16
No comments:
Post a Comment