అవతారం

యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బు చాటున
ఖనేల్మన్నాయి!
నరక లోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికి పడ్డాయి!
ఉదయ సూర్యుని సప్త హయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!
కనకదుర్గా చండ సింహం
జూలు దులిపీ,
ఆవులించింది!
ఇంద్ర దేవుని మదపు టేనుగు
ఘీంకరిస్తూ,
సవాల్ చేసింది!
నందికేశుడు రంకెవేస్తూ,
గంగడోలును
కదిపి గెంతేడు!
ఆదిసూకర వేద వేద్యుడు
ఘుర్గురిస్తూ,
కోర సాచాడు!
పుడమి తల్లికి
పురిటి నొప్పులు
కొత్త సృష్టిని స్పురింపించాయి!
-14 -4 -1934
శ్రీరంగం శ్రీనివాస రావు.
No comments:
Post a Comment