Sunday, 9 June 2013

నీడలు

చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘం భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా
వీళ్ళందరూ సగం సగం మనుష్యులు
మరోసగమ్ మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం, భాగవతం చదువుతారు
పాపం,పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విధ్యాధికులు విధూషకులు
తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
ధారిపక్క నిల్చిన మోడుచెట్ల భాధని అనువదించాలి
పచ్చికలో ధాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యా గగనం రుథిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, ఇల్లేమో దూరం
చేతిలో దీపమ్ లేదు, ధైర్యమే ఒక కవచం
-దేవరకొండ బాల గంగాధర తిలక్
అమృతం కురిసిన రాత్రి 

4 comments:

  1. Thank you. Was searching for this poem this morning.

    ReplyDelete
  2. Thank you so much Bhargavi Gaaru. Great Collection

    ReplyDelete
  3. తిలక్ తిలక్ తిలక్

    ఈ నా రాత్రి ప్రతి రాత్రి మీకే(తిలక్ )అంకితం

    ReplyDelete