Sunday, 29 September 2013



ఆకాశం కు(ఇ)రులు సవరిస్తూ...

నుదుట అధర సంతకం చేస్తున్న రవి!!
30Sep13



సందు సందుకో పార్టీ!
మందితో, మందులో, మతంలో మునగడానికి!!

Thursday, 19 September 2013

భార్గవి/ ఆగని పయనమెందుకో!

ఇరు సంధ్యల మధ్య
ఇరుక్కుపోయిన పయనం లో
పశ్చిమం వైపు ఆగని పరుగు ఎందుకో!
ఎంతో దూరం తోడు రాలేని
ఉషోదయంతో సంబరంగా
ఎన్ని ఎండమావులు దాటి
నడచినా...
నడి రాతిరిగా మారిన
ఎడారి ఆలోచనలు...
నన్ను ధాటిపోలేని
నాలోని గురుతులు
నన్నే చెరిపేసుకుంటూ
కొత్త వ్యక్తిత్వాన్ని
గీసుకుంటున్నాయి
తమకు తామే అయిన
జ్ఞాపకాలు......
నేను తలచుకోవట్లేనని
కలల కత్తులు పట్టుకుని
యుధ్ధానికి సిద్ధమయ్యాయి!

అలసిపోయాను అంతర్యుద్ధంలో
గుండె లోతుల్లో
చీరుకున్న గతం గురుతులు!
విడుదల కాలేని
స్మృతుల సంకెళ్ళతో...!
తెంచుకోలేని బంధాలు
యుద్ధం విరమించుకుని
ప్రాణాలు పోగొట్టుకున్న
క్షణాల శవాలను మోసుకుంటూ
నడుస్తున్న మనిషి కాని మరో ప్రాణిని!
మౌనంగా ఆకాశంతో మంతనాలు చేస్తూ
నడుస్తున్న దారి వెంట
తోడు రాలేని నీడలను
నిశిలోనే వదులుకుని
మూలుగుతున్నమనసు ఒకటి
అడుగు కింద తొలుస్తున్నా
ఉషోదయం కోసం
సాగుతున్న బాటసారిని!
ఇరు సంధ్యల మధ్య
ఇరుక్కుపోయిన పయనం లో
పశ్చిమం వైపు ఆగని పయనమెందుకో!

19/ 09/ 13
4:30 pm 
వెతుకుతున్నాను ఇంకా...!
ఎందుకోసమో...!?
వేచి ఉన్నాను ఇంకా...!
ఎవరి కోసమో...!?

నాకే అర్థమవని నా చూపుల ప్రశ్నలు
నాతో బయల్పడని నా ఆలోచనలు
బదులిస్తావని నీకోసం వస్తే
ఎదురు ప్రశ్నై నను సాధిస్తావా?
విధి రాసిన వింత కథను
మార్చాలని ఆరాటం!
అందుకే నా పోరాటం

వ్యర్థమైన కాలమాపి
తిరిగి రాయాలి
కవితలల్లాలి
కావ్యమవ్వాలి
పూలు పూయాలి
నవ్వులై విరియాలి జీవితం!!

Tuesday, 17 September 2013

భార్గవి/ కూలికి బోరా కొడకా!
గట్కబువ్వ తిన్రాలేద్రా పొద్దుగాల?
ఏమొ గుస్సజేస్థున్నౌ!
అమ్మ అయ్యలేని
అనాథ ఎదవవు
ఏం సదువుల్రా సిన్నా
ఎందుకు పనికొస్తయ్

ఎంగిలిషు సదవనీకీ
నీ అయ్య ఏంమిగిలిచ్చిండు?
సాని సందులల్లబడి
తాగి తాగి సచ్చిండు

గూడుకీడ దిక్కులేదు
గుడ్డలేడ ఉన్నయ్ రా?!
మళ్ళ మళ్ళ అడిగితే
మక్కెలిరగ దంత బిడ్డ!

పసిబిడ్డవ్ గావు కొడ్క
పన్నెండేండ్లచ్చినయ్
కూలి లేని నాడు నీకు
ఖాళి కడ్పే మిగుల్తది

గొట్టు గుండెర నీది
గంటలెక్క మోగుతుంది
తిండి లేని గుండెల ఇంక
బండబారని తడుంది
ఎండ్క పొయ్న కట్టెనుగూడ
ఏట్ల పడదోస్తుంది!

భుజాలన్నమ్ముకుని
భూములమ్ముకున్నోల్లమ్
కను కొల్కిల కాల్వగట్టి
దినామ్ తడ్పుతం పొలం

పొద్దుగల పొద్దుగాల
బురదగప్కొని తిరిగేటోల్లం
పొధ్ధుగూకినంక రూపం
చమురు ఇంకిన దీపమ్

కూలికి బోరా కొడ్కా
ఇంత కూడన్న దొరుకుతది
ఇర్కుల బత్కులు మాయి
ఇరగబూశిన ఆశలు నీయి

తిండిలేక, నిద్ర లేక
పీక్కపొయ్న కండ్లు జూసి
ఒళ్ల పండబెట్టుకోను
అమ్మ లేదీడ నీకు


పోర పోరగా నువ్వు
జల్ది వోయి పన్ల జేరు
06Sep13

Monday, 9 September 2013

భార్గవి/ పాపం పసిపిల్లాడే...!

పాపం పసిపిల్లాడే...!
పదిహేడేల్లె అంట!
అడుకోడానికొచ్చిండు
ఈడికి...!
డిల్లీ కాడికి!
ఈడికి
ఆట బొమ్మనియ్యిండ్రి
ఏంది...?!
గుక్కపట్టి ఏడుస్తున్నడా?! పాపం...
పాపం...??
అందమైన బొమ్మ కోసం
పాప మ్మ్ మ్ మ్....!!

అనంత కోటి విశ్వం లో
అన్నపూర్ణైనా అంగడి బొమ్మే!
ఆది శక్తైనా అమ్మా బొమ్మే...!!
 అవని చితికిన గుండె
నెత్తురు అడుసుతో
పురుడు పోసుకున్న బొమ్మ!
ఆడదేగా అసలు బొమ్మ!
ఆడుకోనివ్వండ్రా...
పాపం...! పిల్లగాడు

పగిలిపొతదేమో అని
పైత్యం మాటలెందుకురా?!
పగిలిన బొమ్మ విలువ
చిరిగిన దాని వలువ
ముక్కలైన గాజు బొమ్మ
ప్రతి ముక్కకో
గుడ్డి కన్నీటి చుక్క
రాల్చి రాల్చి
కొలిచి దాన్ని
రూపాయితో సరిచూసి
పంచుతాడు. పాపం పసిపిల్లాడు!

అంబాడు కుంటూ
తిరుగుతుండు
నడక నేర్పడానికి
అమ్మలేదంట ఆనికి పాపం!
పాపం...! పిల్లగాడు
పంచదార తిని పండుగ చేస్కుందం

ఆడ బొమ్మలింట్ల
ఆడుకోవడానికి శాన ఉన్నాయ్
వదిలేయ్యండ్రి ఆన్నీ
పిల్లగాడే గద!
పాపం పిల్లగాడే గద!!

Saturday, 7 September 2013




99 వసంతాలు నింపుకున్న తెలంగాణ కవి కాళోజీ నారాయణ రావు గారి శత జయంతి జరుపుకుంటున్న రోజిది. 

Friday, 6 September 2013



ఇదేనా నీ బదులు?
తెరవలేవా నీ మది గదులు?